ఉత్కంఠభరిత పరిణామాల మధ్య ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్.. పార్టీ అభ్యర్థుల (TRS MLC Candidates 2021)ను ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బండా ప్రకాశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డిలను ఖరారు చేశారు. చివరి నిమిషంలో వెంకట్రామరెడ్డి, బండా ప్రకాశ్‌ల పేర్లు జాబితా (trs mlc candidates list in telangana 2021)లో చేరాయి. కాగా.. నామినేషన్లు వేసిన ఈ నేతలపై ఎలాంటి కేసులున్నాయి..? వాళ్లకు ఎంత ఆస్తి ఉంది..? వాళ్లు సమర్పించిన అఫిడవిట్లలో ఏముందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అభ్యర్థుల్లో మాజీ ఐఏఎస్‌తో పాటు గతంలో పదవులు అనుభవించినవాళ్లు.. కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్‌రెడ్డి కూడా ఉండటం వల్ల ఈ అంశాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఒక్క కేసు కూడా లేదు..
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిపై ఒక్క కేసు కూడా లేదు. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. తనకు ఎలాంటి వాహనాలు కూడా లేవని తెలిపారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, బండ ప్రకాష్ మీద ఒక్కొక్కటి చొప్పున కేసులున్నాయి. వెంకట్రామిరెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలకు కూడా సొంత వాహనాలు లేవు.