కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విజయబావుటా ఎగరేసిన తెరాస.. మేయర్, ఛైర్మన్ అభ్యర్థులను నేడు ఖరారు చేయనుంది. నాలుగు కార్పొరేషన్లలో తెరాసకు స్పష్టమైన ఆధిక్యం కనబరచగా.. మిగిలిన 5 చోట్ల ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎంఐఎంతో కలిసి నిజామాబాద్ నగర పాలక సంస్థను కైవసం చేసుకోవడానికి సిద్ధమైంది. తెరాసకు మేయర్, డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం పంచుకునే అవకాశం ఉంది. ఒకటి, రెండు కార్పొరేషన్లు మినహా మిగతా చోట్ల.. మేయర్ అభ్యర్థులపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
పాత-కొత్త నేతల మధ్య సమతూకం
రాష్ట్రవ్యాప్తంగా 103 పురపాలక సంఘాల్లో గులాబీ జెండా ఎగరడం దాదాపు ఖాయమైంది. మరో పది పురపాలికల్లో.. స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటుతో ఛైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు యత్నిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులను అధికార తెరాస నేడు ఖరారు చేయనుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉద్యమ కాలం నుంచి ఉన్న నేతలను.. రాష్టం ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన వారి మధ్య సమతూకం పాటించాలని భావిస్తోంది.