తెలంగాణ

telangana

ETV Bharat / city

TRS Maha Dharna: కేంద్రంపై ఉద్ధృత పోరుకు తెరాస సిద్ధం.. రేపే మహాధర్నా.. - తెలంగాణ రాష్ట్ర సమితి మహాధర్నా

యాసంగి వరి కొనుగోళ్లపై కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని రేపు.. తెలంగాణ రాష్ట్ర సమితి మహాధర్నా చేయాలని నిర్ణయించింది. ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న ధర్నాలో మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. అనంతరం రాజ్​భవన్​లో గవర్నర్​కు వినతిపత్రం సమర్పించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ధర్నా తర్వాత కూడా కేంద్రం స్పష్టతనివ్వక పోతే.. రాష్ట్రంలో పంటల విధానంపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఎఫ్ సీఐ నుంచి తెలంగాణ ధాన్యం ఎంత కొనుగోలు చేస్తారో రెండు, మూడు రోజుల్లో చెప్పాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయనున్నారు.

TRS Mahaa Dharna on 18th November at Indira park Hyderabad
TRS Mahaa Dharna on 18th November at Indira park Hyderabad

By

Published : Nov 17, 2021, 4:40 AM IST

కేంద్రంపై పోరు క్రమంగా ఉద్ధృతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. యాసంగి వరి కొనుగోళ్లపై స్పష్టతనివ్వాలంటూ డిమాండ్ చేస్తూ... ఇప్పటికే ఈనెల 12న నియోజకవర్గాల వారీగా ధర్నాలు చేసిన గులాబీ పార్టీ... రేపు హైదరాబాద్​లో మహాధర్నాకు సిద్ధమైంది. నిన్న తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెరాస శాసనసభ పక్షంలో కేంద్రం వైఖరిపై చర్చించారు.

మూడు రోజులు నిరీక్షిస్తాం..

హైదరాబాద్ ఇందిరాపార్కులో రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ధర్నా నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్ పర్సన్లు, రైతుబంధు సమితి జిల్లా ఛైర్మన్లు ధర్నాలో పాల్గొంటారని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ధర్నా అనంతరం రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసి వినతి పత్రం సమర్పిస్తారని కేసీఆర్ చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టతనివ్వాలని.. రాష్ట్రంలో ఎంత ధాన్యం ఎఫ్​సీఐ కొనుగోలు చేస్తుందో చెప్పాలని కోరుతూ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, సంబంధిత కేంద్ర మంత్రులకు లేఖలు రాయనున్నట్లు సీఎం వెల్లడించారు. ధర్నా తర్వాత కూడా కేంద్రం నుంచి స్పష్టత ఇవ్వకపోతే.. ఆ తర్వాత రెండు, మూడు రోజులు వేచి చూసి రాష్ట్రంలో పంటల విధానాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రంపై నమ్మకం లేదని.. రైతులు భాజపా నేతల మాటలు విని మోసపోయి నష్టపోకుండా రైతులను ముందస్తుగా అప్రమత్తం చేస్తామన్నారు. ఆ తర్వాత కూడా కేంద్రాన్ని విడిచి పెట్టేది లేదని.. అన్ని వేదికల ద్వారా వెంటాడి.. వేటాడుతామని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇన్నాళ్లూ సర్దుకుపోయాం..

"కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోంది. కేంద్రం విధానాలు దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టాలను తెరాస వ్యతిరేకించింది. రాష్ట్రం కుదుటపడే వరకూ కేంద్రం పేచీ వద్దన్న ఉద్దేశ్యంతో ఇన్నాళ్లూ సర్దుకు పోయాం. రైతులకు నష్టం చేసే విధానాలపై రాజీపడేది లేదు. కేంద్రం రాష్ట్రానికో తీరు అన్న విధానాన్ని అనుసరిస్తోంది. పంజాబ్​లో వరి కొంటూ తెలంగాణలో నిరాకరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో బండి సంజయ్ రైతులను తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు." - కేసీఆర్​, ముఖ్యమంత్రి.

రైతులకు క్షమాపణ చెప్పాలి..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై భాజపా నాయకులు రాళ్లతో దాడులు చేస్తున్నారని.. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానానికి భిన్నంగా యాసంగిలో వరి పంట వేయాలన్న బండి సంజయ్.. దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సంజయ్ అసలు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేంద్రం కొనుగోలు చేస్తామంటే ఉత్తర్వులు ఇప్పించాలని.. లేదంటే పొరాపాటుగా చెప్పానంటూ రైతులకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. గత రెండు రోజుల్లో జరిగిన ఘటనలపై కేసులు నమోదయ్యాయని.. చట్టం, న్యాయస్థానాలు వాటిపై భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకుంటాయన్నారు.

ఈనెల 29 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లోనూ కేంద్రాన్ని నిలదీస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంటు లోపల, బయట అన్ని వేదికలపై కేంద్రంపై పోరాటం కొనసాగుతుందన్నారు. తెరాస వేట ప్రారంభమైందని... వెంటాడుతూనే ఉంటామన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details