పెద్దల సభలో మూడు ఖాళీలు.. గులాబీ నేతల ఆశలు గవర్నర్ కోటాలో శాసనమండలిలో అడుగు పెట్టేందుకు పలువురు తెరాస నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. తెరాస అధిష్ఠానం మాత్రం వివిధ సామాజిక, రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శాసనమండలిలో నాలుగు ఖాళీలు ఉన్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలు ఆగిపోయాయి. అక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... తెరాస అభ్యర్థి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుపు దాదాపు ఖాయమే.
త్వరలో ఖరారు..
రాములునాయక్‌పై వేటు వేయడం వల్ల ఒకటి, ఇటీవల నాయిని నర్సింహారెడ్డి, కర్నె పదవీకాలం ముగియడం వల్ల రెండు... గవర్నర్ కోటాలో ఒక స్థానంలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... త్వరలో మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ భేటీలో మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి... గవర్నర్‌కు సిఫార్సు చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు... కేసీఆర్, కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మూడో దానిపై సందిగ్ధం..!
వివిధ సమీకరణాలకు పరిగణలోకి తీసుకున్న తెరాస నాయత్వం... రెడ్డి సామాజిక వర్గం నుంచి నాయిని నర్సింహారెడ్డి, బీసీ లింగాయత్ నుంచి కర్నె ప్రభాకర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే... మూడో స్థానాన్ని బ్రాహ్మణ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కవి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేరు చాలా కాలంగా వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి అభ్యర్థిత్వాన్ని కూడా తెరాస పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అధిష్ఠానానికి విజ్ఞప్తులు..
తమకు అవకాశం ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం తెరాస నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితోపాటు పలువురు నేతలు కేసీఆర్, కేటీఆర్‌ను కోరుతున్నారు. రాములు నాయక్ స్థానంలో మళ్లీ ఎస్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటే... మాజీ ఎంపీ సీతారాం నాయక్ పేరును పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. సుదీర్ఘ కాలంగా పార్టీతో ఉన్న ఉద్యమ, విద్యార్థి నేతలు... తమను మండలికి పంపించాలని పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారితోపాటు... పార్టీ టిక్కెట్ దక్కని వారికి కూడా ఎమ్మెల్సీ స్థానంపై హామీ ఇచ్చారు. వారందరూ తమను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:'చైనా ఏకపక్ష ధోరణి వల్లే ఈ ఉద్రిక్త పరిస్థితులు'