జీహెచ్ఎంసీ అభ్యర్థుల ఖరారులో తెరాస ఆచితూచి అడుగులు వేస్తోంది. మొదటి జాబితాలో ఎక్కువగా సిట్టింగులకే టిక్కెట్లు ఇచ్చిన గులాబీ పార్టీ... పోటీ తీవ్రంగా ఉన్న చోట వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మిగతా డివిజన్లలో తెరాస టిక్కెట్ దక్కని వారికి ఇతర పార్టీలు గాలం వేసే అవకాశాలున్నట్టు భావిస్తున్న నాయకత్వం... చివరి వరకు వేచి చూసే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 105 స్థానాలకు నిన్న రాత్రి తెరాస అభ్యర్థులను ప్రకటించింది. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు కలిసొచ్చేలా 105 పేర్లతో తొలి జాబితా విడుదల చేసినట్టు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిన్నటి జాబితాలో 44 స్థానాలు ఎంఐఎం సిట్టింగ్ స్థానాలే. ఆయా స్థానాల్లో తెరాస కేవలం స్నేహపూర్వకంగానే పోటీ చేస్తోంది.
దాదాపుగా సిట్టింగ్‌లకే..
మిగతా 101 స్థానాల్లో అత్యధికంగా సిట్టింగ్ కార్పొరేటర్లకే మళ్లీ అవకాశం ఇచ్చింది. ఆర్సీ పురం, సోమాజిగూడ, మియాపూర్, సుభాష్‌నగర్ లో మాత్రమే కొత్త అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్ ఇటీవల మరణించినందున... ఆ స్థానంలో ఉప్పలపాటి శ్రీకాంత్‌కు అవకాశం కల్పించారు. ఆర్సీ పురంలో సిట్టింగ్ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్‌ను పక్కన పెట్టి పుష్ నగేష్ యాదవ్‌కు టికెట్ కేటాయించింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సిట్టింగులకే మళ్లీ అవకాశం లభించింది. సోమాజిగూడలో ఆకుల విజయలక్ష్మి ఆరోగ్య పరిస్థితుల కారణంగా... అక్కడ వనం సంగీత యాదవ్‌ను బరిలో నిలిపింది. మిగతా ప్రాంతాల్లో సిట్టింగ్‌లు అందరికీ అవకాశాలు లభించాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బోరబండ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.