తెలంగాణ

telangana

ETV Bharat / city

'సర్కారు పరిస్థితేంటీ..? ప్రత్యర్థులు ఎవరు..?' తెరాసలో సర్వేల సందడి.. - తెరాసలో సర్వేల సందడి

TRS Surveys: తెరాసలో సర్వేల సందడి నెలకొంది. తెరాస ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉంది..? రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఎలా అమలవుతున్నాయి..? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది.? ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయి..? ప్రత్యర్థులెవరు? లాంటి అంశాలపై నేతలు సర్వేలు నిర్వహిస్తున్నారు.

TRS Leaders doing Surveys for coming elections in telangana
TRS Leaders doing Surveys for coming elections in telangana

By

Published : Jul 8, 2022, 11:22 AM IST

TRS Surveys: రాష్ట్రంలో రాజకీయ, పాలన పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సర్వేలు చేపట్టింది. ఈసారి ఒకే దఫా మూడు జరుగుతున్నాయి. ప్రశాంత్‌కిశోర్‌ సర్వేతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల స్థాయుల్లో, శాసనసభ్యుల ఆధ్వర్యంలో సొంత నియోజకవర్గాల్లో చేపట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి మూడు నెలలకోసారి పార్టీ వివిధ సంస్థల ఆధ్వర్యంలో సర్వేలు జరుపుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి పీకేతో ఒప్పందం చేసుకోగా.. ఆయన బృందం నెల రోజుల పాటు సర్వేలు నిర్వహించి నివేదికలను ఇస్తోంది. వాటి ఆధారంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు అధిష్ఠానం దిశానిర్దేశం చేస్తోంది.

తాజాగా సర్వేల తీరులో అధిష్ఠానం కొంతమేరకు మార్పులు చేసింది. పీకే సర్వే యథాతథంగా కొనసాగుతోంది. దీనికి అదనంగా.. 33 జిల్లాల పార్టీ అధ్యక్షులూ తమ తమ జిల్లాల పరిధిలో సర్వేలు చేయాలని అధిష్ఠానం సూచించింది. సర్వే సంస్థల సమాచారమూ వారికి అందించింది. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సొంతంగా సర్వేలు చేపట్టేందుకు ముందుకొచ్చారు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై గ్రామాలవారీగా సర్వేలు నిర్వహిస్తామని వారు అధిష్ఠానం దృష్టికి తీసుకురాగా.. ఎమ్మెల్యేలందరూ సర్వేలు చేపట్టాలని తెలిపింది. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో మూడు సర్వేలు ప్రారంభమయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్వంలో చేపట్టిన సర్వే ఈ నెలాఖరు వరకు సాగుతుంది. ఫలితాలను క్రోడీకరించి.. నివేదికలను అధిష్ఠానానికి వచ్చే నెల మొదటి వారానికి అందిస్తారు. కొన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా తమ గురించి సర్వే నిర్వహించుకోవాలని, నివేదికలో ఫలితాన్ని సైతం వెల్లడించాలని అధిష్ఠానం సూచించింది.

ఎమ్మెల్యేలూ నివేదించాల్సిందే..

సొంత సర్వేలు చేయించుకుంటున్న ఎమ్మెల్యేలు సైతం తమ సర్వే ఫలితాలను అధిష్ఠానానికి నివేదించాలి. వారు నియోజకవర్గాల్లో నెలాఖరుకు సర్వేలు పూర్తి చేయించి, ఆగస్టు 15లోగా నివేదికలను పంపించాలి. కేవలం ఫలితాలే కాకుండా సర్వే చేసిన సంస్థల సమాచారం, శాంపిళ్ల వివరాలను సైతం వెల్లడించాలి. వాస్తవాల ధ్రువీకరణ కోసం ఇది తప్పనిసరని అధిష్ఠానం భావిస్తోంది. మూడు సర్వేలు కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా తెరాసలో సందడి నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే హడావిడిలో ఉన్నారు. సర్వేల ఫలితాలు వచ్చిన అనంతరం వాటిని బేరీజు వేసి, వాస్తవ పరిస్థితులను అధిష్ఠానం విశ్లేషించి కార్యాచరణ చేపట్టే వీలున్నట్లు తెలిసింది.

సర్వేల్లో సేకరించే అంశాలు..

  • తెరాస ప్రభుత్వ పాలన తీరు
  • రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల నిర్వహణ
  • నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు
  • ఎన్నికల్లో విజయావకాశాలు
  • ప్రత్యర్థులెవరు?

వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ పాలనపై కూడా సర్వేల్లో సమాచారం సేకరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details