గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస.. ప్రచారంలోనూ అదేజోరు కొనసాగిస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నగరంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్‌లో మంత్రి సత్యవతిరాఠోడ్ ప్రచారంలో పాల్గొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్‌లో వివిధ పార్టీల కార్యకర్తలు మంత్రి ఈటల సమక్షంలో తెరాసలో చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్ అభ్యర్థి తరఫున మంత్రి ప్రచారం చేశారు. అభివృద్ధే తెరాస మంత్రమని ఈటల స్పష్టంచేశారు.
గ్రేటర్ పోరు: గడపగడపకు కారు... గల్లీల్లో రోడ్‌షోల జోరు
బల్దియా ఎన్నికల ప్రచారంలో కారు దూసుకుపోతోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రోడ్‌షోలతో నగరాన్ని చుట్టివస్తుండగా... డివిజన్ ఇంఛార్జ్‌లు గడపగడపకూ వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శల దాడి చేస్తూనే.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లను రాబట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈనెల 28న నిర్వహించే సీఎం బహిరంగసభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. బేగంబజార్ తెరాస అభ్యర్థి పూజవ్యాస్ గౌలిగూడలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. జాంబాగ్ డివిజన్ పరిధిలోని హిందీనగర్, కట్టెలమండి ప్రాంతాల్లో తెరాస అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అల్వాల్ డివిజన్‌లో అభివృద్ధి చూసి మరోసారి గెలిపించాలని తెరాస అభ్యర్థి విజయశాంతి కోరారు. మరోసారి అవకాశమిస్తే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని భారతీనగర్ అభ్యర్థి సింధు వేడుకున్నారు. భోలక్‌పూర్ డివిజన్ అభ్యర్థి నవీన్ గౌడ్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఎస్రావునగర్ 2వ డివిజన్ అభ్యర్థి పావని ప్రచారంలో దూసుకుపోతున్నారు. మీర్‌పేట్ హోసింగ్‌బోర్డ్ 4వ డివిజన్ తెరాస అభ్యర్థి ప్రభుదాస్.. ఎన్నికల్లో గెలిపిస్తే రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారిస్తానని హామీఇచ్చారు.
ఓవైపు ప్రచారంలో అభ్యర్థులు దూసుకెళ్తుండగా... తెరాస అధినేత, ముఖ్యమంత్రి ఈనెల ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. సభకు భారీగా జనాలను సమీకరించేందుకు నాయకులు ఏర్పాట్లుచేస్తున్నారు.