ఈటల రాజేందర్ వైఖరి తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లుగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తన సమస్యలు, గొడవలకు నైతికబలం కోసం పదేపదే తన పేరు ప్రస్తావించడం.. ఈటల రాజేందర్ భావదారిద్య్రానికి, విచక్షణ లేమికి నిదర్శనమని హరీశ్ ధ్వజమెత్తారు. తన భుజాలపై తుపాకి పెట్టాలనుకోవడం విఫలయత్నమేనని మంత్రి వ్యాఖ్యానించారు. ఈటల మాటల్లో మనోవికారమే తప్ప ఎంత మాత్రం సత్యం లేదని విమర్శించారు. ఈటల తెరాసలో ఉండాలా..? వద్దా..? అనేది ఆయన ఇష్టమని.. అయితే ఆయన వీడితే తెరాసకు వీసమెత్తు కూడా నష్టం లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Harish rao: 'ప్రాణమున్నంత వరకు కేసీఆర్ మాట జవదాటను' - ఈటలపై హరీశ్‌రావు కామెంట్స్
"తెరాస నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కర్తవ్యంగా భావిస్తాను. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులు. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ మాట జవదాటను. ఈటల పార్టీ వీడితే.. వీసమెత్తు కూడా నష్టం లేదు."- మంత్రి హరీశ్‌రావు.
తెరాసకు ఈటల చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువని మంత్రి పేర్కొన్నారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. తెరాసలో తాను నిబద్ధత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తనని... పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ ప్రయోజనాలే తనకు పరమావధి అని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. తనకు పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా పూర్తిచేయడమే తన విధి అన్నారు.
తెరాస నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం తన కర్తవ్యంగా భావిస్తానని హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు.. తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులని తెలిపారు. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ మాట జవదాటనని మరోసారి చెబుతున్నానని హరీశ్‌రావు ఉద్ఘాటించారు.