కృష్ణా జలాల మీద హక్కు లేనివాళ్లు ఇవాళ ప్రాజెక్టులు కడుతున్నారని తెరాస ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. హక్కు లేని నీటిని ఆంధ్రప్రదేశ్ దొంగిలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ చర్యలను తెరాస ప్రభుత్వం అడ్డుకుంటుందని పల్లా పునరుద్ఘాటించారు. న్యాయబద్ధంగా పోరాటం చేస్తూనే ప్రజలను చైతన్యపరుస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం 61 లక్షలకు చేరుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పల్లా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల 20 నాటికి సభ్యత్వ నమోదు పూర్తవుతుందని తెలిపారు. ఏడేళ్లుగా సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాద బీమా కూడా ఇస్తున్నామన్న పల్లా.. కొత్తగా చేరిన వారికీ బీమా వర్తింపచేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఎలా స్పందించాలనేదానిపై కేటీఆర్.. ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారని పల్లా తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక, కృష్ణానదిపై ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్రంలోని రాజకీయ పక్షాల వైఖరి, విపక్షాల విమర్శలకు దీటుగా స్పందించడం, వాటిని ఎదుర్కొనే వ్యూహాలపై కేటీఆర్ కీలక సూచనలు చేసినట్టు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో సామాజిక మాధ్యమాల విభాగం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు పేర్కొన్నారు.