జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం పోటీకి దూరంగా ఉండాలని తెరాస నిర్ణయించింది. భాజపా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ నుంచి ఎన్నికైన భాజపా కార్పోరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించారు. ఆ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. రమేష్ గౌడ్ కుమారుడు పార్టీ తరఫున పోటీ చేస్తున్నందున ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని తెరాసను భాజపా కోరింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రగతిభవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసింది. సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు.
లింగోజిగూడ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని తెరాస నిర్ణయం - telangana news
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని తెరాస నిర్ణయించింది. ఏకగ్రీవం చేయాలన్న భాజపా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. లింగోజిగూడ కార్పొరేటర్ రమేశ్‌గౌడ్ మృతితో ఖాళీ ఏర్పడగా.. ఉపఎన్నికలో రమేశ్‌గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నారు.
ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే ఆకుల రమేష్ గౌడ్ మరణించడం దురదృష్టకరమన్న కేటీఆర్... భాజపా విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సూచన మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. మానవతా ధృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారని తెరాస అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు భాజపా ప్రతినిధి బృందం, ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.
ఇదీ చదవండి: మినీ పోల్స్: సీఎం సహా నేతలంతా నియమావళిని పాటించాల్సిందే!