ఉద్యోగ ప్రకటనపై సర్వత్రా హర్షాతిరేకాలు.. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు.. TRS celebrations: ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీతో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో సంబురాలు మొదలయ్యాయి. అటు తెరాస శ్రేణులతో పాటు యువతలోనూ హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తలు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో అవాకులు చెవాకులు పేలిన విపక్షాలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాలని కోరారు. ఉద్యోగ ప్రకటనపై బొరబండ కార్పొరేటర్ బాబాఫసియుద్దిన్.. కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంతో ఓయూలో సంబురాలు మిన్నంటాయి. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో కేసీఆర్ చిత్రపాటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోనూ తెరాస కార్యకర్తలు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మేడ్చల్లో ఆ నియోజకవర్గ ఇంఛార్జి చామకూర మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి.. స్వీట్లు పంచారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో తెరాస నాయకులు వేడుక చేసుకున్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, మల్యాల మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేల్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై తెరాస శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. ఉద్యోగ ఖాళీలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన అనంతరం తెరాస నాయకులు.. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
నిరుద్యోగులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్ చిత్ర పటానికి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనపై ఖమ్మం తెరాస జిల్లా కార్యాలయంలో శ్రేణులు వేడుక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతామధు, జిల్లా నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: