తెలంగాణ

telangana

ETV Bharat / city

దాదాపుగా అభ్యర్థులు ఖరారు పూర్తి.. ప్రచారమే తరువాయి - జీహెచ్​ఎంసీ-2020

నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనున్నందున... పూర్తిస్థాయి ప్రచారానికి తెరాస సిద్ధమవుతోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమకు కేటాయించిన డివిజన్లలో ప్రచారం ప్రారంభించారు. ఎల్లుండి నుంచి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు రంగంలోకి దిగనున్నారు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి రోజున ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

trs campaign strategy in ghmc elections
అభ్యర్థులు ఖరారే.. ప్రచారమే తరువాయి

By

Published : Nov 20, 2020, 6:00 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార వ్యూహాలకు తెలంగాణ రాష్ట్ర సమితి తుది మెరుగులు దిద్దుతోంది. నేటితో నామినేషన్ల గడువు ముగున్నందున... ప్రచారం ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతోంది. నాలుగు దశలుగా ప్రచారం చేసేందుకు గులాబీ పార్టీ వ్యూహాలను సిద్ధం చేసింది. అభ్యర్థుల ఇంటింటి ప్రచారం, డివిజన్ ఇంఛార్జ్​ల, కేటీఆర్ రోడ్ షో, చివరికి కేసీఆర్ ప్రచారం ఉండేలా ప్రణాళికలు చేసినట్టు తెలుస్తోంది. అభ్యర్థులందరూ ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కరోనా జాగ్రత్తలతో డివిజన్ ఇంఛార్జ్​ల నేతృత్వంలో ముఖ్య కార్యకర్తలతో నామినేషన్ల దాఖలుకు సిన్నద్ధమవుతున్నారు.

ఇంటింటికీ తిరిగేలా..

సిట్టింగ్ కార్పొరేటర్లే అభ్యర్థులుగా ఉన్న చోట ఇప్పటికే ఒకటి, రెండు సార్లు ప్రచారం చేశారు. వ్యూహాత్మకంగా సిట్టింగ్ కార్పొరేటర్లు, ఆశావహులను లాక్​డౌన్, వరద కష్టాల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ నాయకత్వం పురమాచింది. అది ఇప్పుడు కొంత ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే... అభ్యర్థులు పూర్తి స్థాయి ప్రచారంలోకి దిగనున్నారు. ప్రచారం గడువు ముగిసేలోగా ఒక్కో ఇంటికి కనీసం రెండు మూడు సార్లు వెళ్లి ప్రతీ ఓటరును కలవాలని పార్టీ నేతలు అభ్యర్థులకు అధిష్ఠానం సూచించింది.

ఇంఛార్జ్​ల పాదయాత్రలు..

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమకు కేటాయించిన డివిజన్​లో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అభ్యర్థులు, ఆశావహులు, ముఖ్య కార్యకర్తలతో స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలాబలాలు, ఇతర పార్టీల అభ్యర్థుల వివరాలు సేకరించి ప్రచారంలో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల టిక్కెట్లు దక్కని ఆశావహులను బుజ్జగించే పనిలో ఉన్నారు. నిరాశతో పార్టీ మారకుండా డివిజన్ ఇంఛార్జ్​లు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని, క్రమశిక్షణ రాహిత్యాన్ని మాత్రం సహించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారని వివరిస్తున్నారు. సాయంత్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాదయాత్రలతో బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నారు.

కేటీఆర్​ రోడ్​ షోలు..

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సారథ్యం వహిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఈ నెల 22 నుంచి రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రోజుకు దాదాపు పది, పన్నెండు వార్డుల చొప్పున వారం రోజుల్లో వందకుపైగా డివిజన్లలో ప్రచారం చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. మూడు, నాలుగు వార్డులకు ఓసారి ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు ఆరేళ్లలో హైదరాబాద్​లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ... మరోవైపు విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలను ఆకర్షించేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు.

అధినేత ప్రచారం..!

రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 28 లేదా 29న ప్రచారంలో పాల్గొనాలని భావిస్తున్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రచారం ఎలా చేయవచ్చుననే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సభ నిర్వహించాలా? రోడ్ షోలో పాల్గొనాలా? ఇంకా ఏదైనా రూపంలో చేయవచ్చునా అనే అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దుబ్బాకలో భాజపా సామాజిక మాధ్యమాల ప్రచారాన్ని సరైన విధంగా తిప్పికొట్టలేక పోయినట్టు భావిస్తున్న తెరాస... ఈ సారి మరింత జాగ్రత్త పడుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇదీ చూడండి:గులాబీ వ్యూహాలు... గ్రేటర్​లో విజయానికి సరికొత్త అస్త్రాలు

ABOUT THE AUTHOR

...view details