తెలంగాణ

telangana

ETV Bharat / city

ChinnaJeeyar Swami: 'కేసీఆర్​తో విభేదాల్లేవు.. ఆయన మద్దతు ఎప్పుడూ ఉంది'

ChinnaJeeyar Swami: సమతామూర్తి కేంద్రంలోని 108 ఆలయాల్లో నేడు(ఫిబ్రవరి 19న) కల్యాణ మహోత్సవం జరగనుందని త్రిదండి చినజీయర్​ స్వామి తెలిపారు. ప్రతి ఒక్కరూ కల్యాణాన్ని దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆరోగ్యం, ఇతర కార్యక్రమాల దృష్ట్యా సహస్రాబ్ది ఉత్సవాలకు సీఎం కేసీఆర్​ రాలేకపోయి ఉంటారని ఆయన తెలిపారు.

Tridandi ChinnaJeeyar Swami About cm kcr absent for sahasrabdi celebrations
Tridandi ChinnaJeeyar Swami About cm kcr absent for sahasrabdi celebrations

By

Published : Feb 18, 2022, 4:26 PM IST

Updated : Feb 19, 2022, 5:31 AM IST

ముఖ్యమంత్రితో ఎలాంటి విభేదాలు లేవు

ChinnaJeeyar Swami: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చినజీయర్‌స్వామి తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం నుంచి ఆయన పూర్తి సహకారం ఉందని, అవసరమైన అన్ని వసతులూ కల్పించారని చెప్పారు. శనివారం 108 దివ్యదేశాలలోని దేవతామూర్తుల కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం చినజీయర్‌స్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘మొదటిరోజు సీఎం కేసీఆర్‌ ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ ఉండే సేవకుల్లో తాను మొదటి సేవకుణ్ని అని చెప్పారు. తర్వాత ఆయనకున్న కార్యక్రమాలు, ఆరోగ్యం దృష్ట్యా రావడానికి అవకాశం దొరక్కపోయి ఉండవచ్చు. అంతమాత్రానికే విభేదాలు అనే మాట సృష్టించడం సరికాదు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. లేనివాటిని సృష్టించి మంచి వాతావరణానికి ఇబ్బంది తేవొద్దు. ఆయన నుంచి మాకు ఎప్పుడూ మద్దతు ఉంది. రాజకీయ రంగు పులమడం సరికాదు. ఒకవేళ విభేదాలు వచ్చి ఉంటే ఉత్సవాలప్పుడే విద్యుత్తు ఆగిపోయేది.. భగీరథ నీళ్లు ఆగిపోయేవి.. పోలీసు బందోబస్తు వెనక్కి వెళ్లిపోయేది కదా! అలా ఏమీ జరగలేదు కదా!’’ అని చెప్పారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు 108 దివ్యదేశాలల్లోని దేవతామూర్తుల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్ల చినజీయర్‌స్వామి చెప్పారు. రామానుజుల భారీ విగ్రహానికి చేరుకునే సోపాన మార్గంపై 14 మెట్లను వినియోగించుకుని క్రతువు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇలా 108 సన్నిధిలలో ఒకేసారి కల్యాణోత్సవం జరగడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, సీఎంనూ ఆహ్వానించామన్నారు.

ప్రతిపక్షం, స్వపక్షమనే భేదం లేదు..

ప్రతిపక్షాలు, స్వపక్షాలు అనేది ప్రభుత్వానికి ఉంటుందే తప్ప తమకు కాదని చినజీయర్‌స్వామి తెలిపారు. అధికారంలో ఉన్న వారినే ఆహ్వానించారని, ప్రతిపక్ష నాయకులను పిలవలేదన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. తాము అందర్నీ పిలిచామని, కొందరు తమ ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రాకపోయి ఉండవచ్చన్నారు. తమ ఆహ్వానం ఎప్పటికీ ఉంటుందని, ఎవరైనా సమతామూర్తి కేంద్రానికి రావొచ్చన్నారు. తాము చాలామంది ముస్లిం నాయకులను ఆహ్వానించామని, అందుకే ఆహ్వాన పత్రికలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు అరబిక్‌, స్పానిష్‌లోనూ ముద్రించి అందించామని చెప్పారు. వైదిక శాస్త్రాల ప్రకారం దేవుడి పూజలో పాల్గొనేందుకు ఎలాంటి ఆహ్వానం అవసరం లేదని, అలాంటప్పుడు పిలవడం, పిలవకపోవడమనే ప్రశ్న ఉండదన్నారు.

20 నుంచి సువర్ణమూర్తి సందర్శన..

ప్రస్తుతం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకే సమతామూర్తి కేంద్రం సందర్శనకు అవకాశం కల్పించగా.. 20వ తేదీ నుంచి ఈ వేళలు మరింత సడలించనున్నట్లు చినజీయర్‌స్వామి చెప్పారు. సువర్ణమూర్తినీ దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలోనే సమతామూర్తి కేంద్రం నిత్య దర్శనానికి వీలు కల్పిస్తామన్నారు. నిర్వహణ కోసం ప్రవేశ రుసుములు నిర్ణయించామే తప్ప టికెట్‌గా పరిగణించరాదని చెప్పారు. తాత్కాలిక వ్యవస్థలో భాగంగా పెద్దలకు రూ. 150, పిల్లలకు రూ. 75 తీసుకుంటున్నారని, త్వరలో అందరికీ అందుబాటులో ఉండేలా ఛార్జీలు నిర్ణయిస్తామన్నారు. ఇంకా ఎన్‌ఎఫ్‌సీ, ఏఆర్‌ సాంకేతికతలు, డైనమిక్‌ ఫౌంటెయిన్‌, 3డీ మ్యాపింగ్‌ వ్యవస్థలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మహాయజ్ఞం తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేశారని గుర్తుచేశారు.

అందుకే కేసీఆర్‌ పేరు వేయలేదు..

‘‘ప్రధాని చేతుల మీదుగా రామానుజుల విగ్రహం ప్రారంభించాలని 2016లోనే నిర్ణయించాం. ఈ విషయాన్ని కేసీఆర్‌కూ తెలియజేశాం. ప్రధాని వంటి వ్యక్తులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా తిరిగి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు. వారు ఏం చేయాలో చెబితే.. అదే విధంగా చేద్దామన్నారు. సమతామూర్తి ఆవిష్కరణ కార్యక్రమంపై ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చినప్పుడు ఎవరెవరు పాల్గొంటున్నారో.. వారి పేర్లే ఆవిష్కరణ ఫలకంపై ఉండటం నియమమని చెప్పారు. 5న సీఎం కేసీఆర్‌కు జలుబు ఉందని, ఆరోగ్యం సరిగా లేదని వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం లేదని చివరిరోజు సమాచారమిచ్చారు. దానికి తగ్గట్టుగా మేం నిర్ణయం తీసుకుని ఆయన పేరు ఆవిష్కరణ ఫలకంలో రాయించలేదు.’’ అని చినజీయర్‌స్వామి చెప్పారు.

ఇదీ చూడండి:

Last Updated : Feb 19, 2022, 5:31 AM IST

ABOUT THE AUTHOR

...view details