తెలంగాణ

telangana

ETV Bharat / city

"సరిలేరు నీకెవ్వరు తారకరామా".. ఎన్టీఆర్​కు నేడు ఘన నివాళి - మహానాడు 2022

Tribute to NTR in Mahanadu : అశేష ఆంధ్రావనికి ఆయన పేరే తారక మంత్రం. సీనీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్రతో చరిత్ర సృష్టించి.. ప్రత్యేకత చాటుకున్న యుగపురుషుడు. తెలుగు జాతి ఉన్నంత కాలం తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జీవించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రతో.. జనంలో చైతన్యానికి నాంది పలికారు. ఆయనే ఆంధ్రుల అన్న ఎన్టీఆర్‌. ఆ మహానేత శతజయంతిని ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. "సరిలేరు నీకెవ్వరు తారకరామా" పేరిట యుగపురుషుడికి ఇవాళ మహానాడు నివాళులర్పించనుంది. ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వాలని.. ఇదే వేదికగా శ్రేణులంతా ముక్తకంఠంతో నినదించనున్నారు.

Tribute to NTR in Mahanadu
Tribute to NTR in Mahanadu

By

Published : May 28, 2022, 6:43 AM IST

Tribute to NTR in Mahanadu : నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానేత. తెలుగు నాట ప్రఖ్యాత ఆంధ్రుడెవరంటే ఎన్టీఆర్ పేరు తప్ప మరెవరి పేరు వినపించదు. కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని ఆలోచించిన వాస్తవిక వాది. అందుకే సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని నినదించారు. జనమే ఊపిరిగా రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీని స్ధాపించి దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి బీజం వేశారు. పార్టీ ప్రారంభించిన 13 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రయ్యారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు... ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా లభించేలా అవతరింపచేసి.. ఆ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు.

Mahanadu 2022 : రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది ఓ శకం. ఆయన ప్రవేశం.. రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసింది. జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. ఈ చైతన్యాన్ని నమ్ముకునే ఆయన తన రాజకీయ జీవితం చివరి వరకూ ధైర్యంగా నడవగలిగారు. 13 ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. మూడుసార్లు విజయం సాధించి.. అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్‌కు ప్రజల పాలనే తప్ప ఎమ్మెల్యేల లాలన తెలియదు. అందుకే ప్రజా సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఇక సినీరంగంలో ఎన్టీఆర్ ఓ నట విశ్వరూపం. తెలుగు లోగిళ్లలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి.. ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు వెండితెర రారాజుగా వెలిగారు. దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆయన.. ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఆ మహా నటుడికి మహానాడు వేదికగా నేడు తెలుగుదేశం ఘన నివాళులర్పించనుంది. ఉదయం ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించనున్నారు. అటు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ టంగుటూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details