కరోనా కారణంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రత్యక్ష బోధన సాధ్యం కాని నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పాఠ్య ప్రణాళికను రూపొందించి అసైన్‌మెంట్ రూపంలో అమలుచేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. లక్ష మంది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు కసరత్తు చేస్తోంది. విద్యార్థుల ప్రగతిని ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు వెళ్లనుంది. స్టడీమెటీరియల్, అసైన్‌మెంట్‌లను విద్యార్థుల చెంతకు చేర్చి, గడువులోగా వారి నుంచి వాటిని సేకరించి ఆయా పాఠశాలలకు అందించేందుకు తపాలాశాఖ సహకారం తీసుకోనుంది. అందుకోసం ఇప్పటికే ఆ శాఖతో గిరిజన సంక్షేమశాఖ చర్చలు జరుపుతోంది. జులై 1 నుంచి ఈ తరహా బోధన చేపట్టనుంది. ప్రత్యక్ష బోధనకు అనుమతించని తరగతుల విద్యార్థులందరికీ.. తిరిగి అది మొదలయ్యే వరకు ఈ విధానం అమలు చేయనుంది.
లక్షమందికి లబ్ధి చేకూరేలా..
రాష్ట్రంలోని ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లోని 4,000 ఆవాసాల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు 400 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు అందుబాటులోకి వచ్చాయి. టీవీ మాధ్యమాల ద్వారా బోధన జరుగుతోంది. అయితే గిరిజన గూడేల్లో మౌలిక వసతుల కొరత, అంతర్జాల అనుసంధానత తక్కువగా ఉండటం తదితర సాంకేతిక కారణాలతో విద్యార్థులు సరిగా చదువుకోలేకపోతున్నారు. గత ఏడాదికి ఆన్‌లైన్ బోధనపై సాధారణ మదింపు చేయగా ఏకంగా 50 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదని వెల్లడైంది. ఈ నేపథ్యంలో 2021-22 విద్యాసంవత్సరంలో గిరిజన సంక్షేమ శాఖ మెరుగైన బోధనకు ప్రత్యామ్నాయాల్ని సిద్ధం చేసింది.