ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ అధికారిక గణాంకాల ప్రకారం 77,795 కరోనా కేసులు నమోదయ్యాయి. 66,665 మంది డిశ్చార్జీ కాగా.. 6,615 మంది నేటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 527 మంది మృత్యువాతపడ్డారు. మిగిలిన వాళ్లు హోంక్వారంటైన్లో కోలుకున్నారు. మొదటి దశలో దాదాపు 8 నెలల్లో 207 మంది మృతి చెందగా.. రెండో దశలో ఏప్రిల్, మే నెలల్లో 320 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతం.. శృంగవరపుకోట, బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగింది.
నగరాలు, పట్టణాల్లో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురంలో అధికంగా వ్యాప్తి చెందింది. 8 మండలాల్లోని 143 గ్రామాల్లో మాత్రం ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. వైరస్ జాడ లేని 143 గ్రామాల్లో.. చాలా వరకూ గిరిజన ప్రాంతాలే ఉన్నాయి. మాస్క్ ధరించటం, భౌతికదూరం పాటించటం.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటివి చేస్తూ.. కరోనాకు అడ్డుకట్ట వేశారు. బయట ప్రాంతాల నుంచి ఇతరులు గ్రామాల్లోకి రాకుండా రహదారులను నిర్బంధించారు. అవసరమైతే తప్ప వేరేవాళ్లెవరూ రాకుండా కట్టడి చేశారు. అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించారు.