తెలంగాణ

telangana

ETV Bharat / city

Treatment of newborn baby తల్లి ప్రేమను మరిపిస్తున్న ఆస్పత్రి - నవజాతి శిశువులకు చికిత్స

Treatment of newborn baby అమ్మలాగా పుట్టిన పిల్లలకు అన్ని అవసరాలు తీరుస్తున్నారు. పుట్టిన శిశువు తక్కువ బరువుతో పుడితే ఎంతో జాగ్రత్తగా చూసుకుని బరువు పెరిగే వరకు వారి వద్దే ఉంచుతారు. నవజాతి శిశువు పుట్టిన తరవాత ఎటువంటి అనారోగ్యాలతో బాధ పడిన కొన్ని ఆస్పత్రులు లక్షల్లో వసూళ్లు చేస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం తక్కువ మెుత్తంలో తీసుకొని అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఎక్కడో చూద్దామా.

Nilofer hospital
నిలోఫర్​ ఆస్పత్రి

By

Published : Aug 30, 2022, 10:31 AM IST

Treatment of newborn baby: ఆ శిశువు ఏడో నెలలోనే పుట్టాడు. బరువు 900 గ్రాములే. అరచేతిలో ఇమిడిపోయేంత రూపం. తల్లిదండ్రులు నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు పరిశీలించి శిశువును ఎన్‌ఐసీయూ(నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)కు తరలించి వార్మర్‌లో పెట్టారు. నిరంతరం పర్యవేక్షించారు. రెండు నెలలు తిరిగేసరికి శిశువు బరువు 900 గ్రాముల నుంచి 1.5 కిలోలకు చేరుకుంది. ఆ తల్లిదండ్రుల మోముపై మళ్లీ నవ్వు విరిసింది.

అలాగే మరోసారి ఎనిమిదో నెలలో పుట్టిన మరో శిశువు కేవలం 750 గ్రాములు బరువు మాత్రమే ఉన్నాడు. దాదాపు 3నెలలు ఎన్‌ఐసీయూలో ఉంచి వైద్యులు కంటికి రెప్పలా కాపాడారు. 1.5 కిలోల బరువుకు చేరుకోగానే తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు తక్కువ బరువుతో జన్మించిన శిశువుల్లో చాలామందికి నిలోఫర్‌ వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. 2 నెలలపాటు ఎన్‌ఐసీయూలో పెట్టి సంరక్షించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుంది. పేదలు, సామాన్యులు, మధ్యతరగతివారికి ఇంత భరించలేదు. అలాంటివారికి నిలోఫర్‌ అండగా నిలుస్తోంది.

నిలోఫర్‌లో జరిగే ప్రసవాల్లో పుట్టేవారితో పాటు ఇతర ఆసుపత్రుల నుంచి చేరే శిశువులు ప్రతినెలా సుమారు 1500 మంది ఉంటారు. వీరిలో 25 శాతం మంది తక్కువ బరువులో పుట్టినవారు ఉంటున్నారు. నవజాత శిశువుల సాధారణ బరువు 2-2.5 కిలోల వరకు ఉండాలి. తక్కువ బరువుతో పుట్టినవారిలో ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాల ఎదుగుదల సరిగా ఉండటం లేదు. ఇలాంటివారిని నిలోఫర్‌లో వార్మర్లు, ఇంక్యుబేటర్‌లలో పెట్టి జాగ్రత్తగా సంరక్షిస్తుండటంతో పాటు సాధారణ బరువుకు చేరుకునేవరకూ చికిత్సలందిస్తున్నారు. అందువల్ల శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని వైద్యులు తెలిపారు. నిలోఫర్‌లో ప్రస్తుతం 120 వరకు వార్మర్లు ఉన్నాయి. ఎన్‌ఐసీయూ వార్డును ఇటీవల విస్తరించి, మౌలిక వసతులు కల్పించారు.

కంగారు మదర్​ కేర్​ పద్ధతి.. ‘నెలలు నిండకముందు, తక్కువ బరువుతో పుట్టే శిశువులను రకరకాల అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇలాంటివారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అమ్మలాంటి లాలన అందిస్తున్నాము. కంగారూ మదర్‌ కేర్‌ పద్ధతిలో శిశువును తల్లి తన గుండెకు హత్తుకోవడం వల్ల కూడా త్వరగా కోలుకుంటున్నారు. ఇంటికి పంపిన తర్వాత తల్లికి తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాము’ అని నియోనటాలజీ విభాగాధిపతి డాక్టర్‌ అలివేలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్వప్న తెలిపారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి నెల వారీగా పరీక్షలు చేసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు ఏవైనా అనారోగ్య సమస్యలుంటే తెలుస్తాయన్నారు. చికిత్సలతో వాటిని నియంత్రించవచ్చన్నారు.

శిశువులు తక్కువ బరువుతో జన్మించడానికి కారణాలు:

*నెలల నిండక ముందు ప్రసవం
*పెళ్లైన 10-15 ఏళ్ల తర్వాత పుట్టడం
*ఆలస్యంగా లేదా చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసుకుని.. గర్భం ధరించడం
*గర్భం సమయంలో తల్లికి అధిక రక్తపోటు ఉండటం
*తల్లిలో రక్తహీనత, ఇతర ఇన్‌ఫెక్షన్లు
*తల్లిలో అధిక లేదా తక్కువ బరువు
*ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు శిశువుల జననం
*గర్భంతో ఉండగా మద్యం, ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడం, ధూమపానం

ఇదీ పరిస్థితి:

*నిలోఫర్‌లో ప్రతినెలా ప్రసవాలు, ఇతర ఆసుపత్రుల నుంచి చేరుతున్నవారు: సుమారు 1500 మంది
*1.5 కిలోల కంటే తక్కువ బరువుతో జన్మించే శిశువులు: 25 శాతం
*అందులో కిలో కంటే తక్కువ బరువుతో జన్మించే శిశువులు: 6-10 శాతం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details