రూ.10కే వైద్య సేవలందిస్తున్న నూరీ పర్విన్ పది రూపాయల డాక్టరమ్మ... ఏపీలోని కడప మాసాపేటలో ఉండే ప్రజలు.. చుట్టుపక్కల జనమంతా ఈ అమ్మాయిని అలానే పిలుస్తుంటారు. ఎందుకంటే.. తను ఎంబీబీఎస్ పట్టా చేతపట్టుకుని కూడా 10 రూపాయల ఫీజుకే వైద్యం చేస్తుంది కాబట్టి. ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం వింతగా ఉన్నా.. మీరు విన్నది నిజమే.
పేదలకు అండగా..
ప్రైవేట్ వైద్యమంటేనే సామాన్యులకు భరించలేని భారం. ఆసుపత్రిలో అడుగు పెట్టింది మొదలు డబ్బు వెదజల్లందే వైద్యం అందదు. ఇలాంటి స్థితిలో అతితక్కువ ధరలకే వైద్య సేవలందిస్తూ పేదలకు అండగా నిలుస్తోంది.. యువ వైద్యురాలు నూరీ పర్విన్. లక్షలు సంపాదించాలనే ఆశ లేదని.. అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలనేదే తన ధ్యేయమని చెబుతోంది.
అప్పట్నుంచే ఆసక్తి..
విజయవాడకు చెందిన నూరీ పర్విన్.. కడప ఫాతిమా వైద్య కళాశాల నుంచి 2017 లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. తోటి వారితో కలసి.. యువతరానికి సామాజికాంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించేది. కొన్ని ప్రత్యేక లఘుచిత్రాల్లోనూ నటించి సామాజిక సందేశాలిస్తుండేది నూరీ పర్విన్. అదేస్ఫూర్తితో ఆదర్శవంతమైన ఆలోచనకు తెరతీసింది.. ఈ యువ వైద్యురాలు. గతంలో పేదవాళ్లకు తక్కువ ఫీజుకే సేవలందించిన వైద్యులను ఆదర్శంగా తీసుకుని వాళ్ల అడుగు జాడల్లో నడిచేందుకు నిర్ణయించుకుంది. డబ్బు, హోదా కంటే చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ ఉండడమే తన కోరికని చెబుతోంది.
రూ.10కే వైద్యం..
కడప నగరంలోని మాసాపేటలో 2020ఫిబ్రవరిలో 10 రూపాయలకే వైద్య సేవలందించేందుకు ప్రత్యేక క్లినిక్ ప్రారంభించింది. కొద్దిరోజుల్లోనే స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. జనరల్ ఫిజీషియన్‌గా పర్విన్‌కు మంచి పేరూ దక్కింది. దీంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 రూపాయల డాక్టర్‌గానూ ఆప్యాయంగా పేరు సంపాదించుకుంది. ఎక్కడైనా.. ఏ పనిలోనైనా విమర్శలు సాధారణం. పర్విన్‌కు అవి తప్పలేదు. అయినా.. ప్రజల ఆదరణ ముందు అవ్వన్నీ తనని వెనక్కిలాగలేదని చెబుతోంది. తక్కువఫీజు తీసుకుంటున్నా.. ఉన్నవాటిలో మెరుగైన సదుపాయాలు, ఆత్మీయంగా పలకరించే సిబ్బంది ఉండడంతో ప్రజలూ ఈ క్లినిక్‌కు వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో అన్ని రకాల సేవలతో మరో ఆసుపత్రి ఏర్పాటు చేసి జనరల్ ఫిజీషియన్, గైనకాలజీ, సర్జరీ, పీడీయాట్రిషియన్ వంటి చికిత్సలను అందిస్తోంది.
సేవే లక్ష్యం..
గతేడాది కరోనా సమయంలో కడపలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఎంతో మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది. వృద్ధాశ్రమాలకు సహాయ సహకారాలు అందించింది. నూరీ ఛారిటబుల్ ట్రస్టు, ఇన్ స్పైరింగ్ హెల్త్ అండ్ యంగ్ ఇండియా పేరుతో నడిచే ట్రస్టులను నూరీ బాధ్యతలు చూసుకుంటోంది. సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే.. పర్విన్, కడప రెడ్‌క్రాస్‌లో జీవితకాల సభ్యురాలుగా, జనవికాస సేవా సమితిలో డైరెక్టర్‌గా, జేసీఐ సంస్థలో ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇక్కడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగానూ సేవలందిస్తోంది. నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవడం, కడప వాసిగా స్థిరపడి పేదలకు సేవ చేయడమే తనకున్న కోరికని చెబుతోంది.. డాక్టర్ నూరీ పర్విన్. సేవే లక్ష్యంగా వైద్య సేవలందిస్తున్న పర్విన్.. రాత్రి వేళల్లో అత్యవసరమైతే పేదల ఇళ్లకే వెళ్లి వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటోంది.