మార్చి 23 నుంచి లాక్‌డౌన్ మొదలవడంతో నిత్యావసరాల కొరత రాకుండా ప్రభుత్వం స్పందించింది. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో పోలీసు, మార్కెటింగ్, రవాణా, పౌరసరఫరాలు తదితర శాఖల అధికారులుంటారు. దీని పర్యవేక్షణ కోసం డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు చురుగ్గా వ్యవహరించడంతో వేలాది టన్నుల నిత్యావసరాలు ఆటంకం లేకుండా రాష్ట్రానికి చేరుతున్నాయి. రాష్ట్రంలో 1.72 లక్షల సరకు రవాణా లారీలుండగా, యజమానులతో మాట్లాడి వాటిని వినియోగిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం
మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడుల నుంచి నిత్యావసరాలు తీసుకొస్తూ నిలిచిపోయిన లారీలను ఆయా రాష్ట్ర అధికారుల అనుమతితో తెలంగాణకు రప్పించారు. నిత్యావసరాలు, అత్యవసర వస్తువులను రవాణా చేసే లారీలకు ప్రత్యేకంగా ఒక పోస్టర్‌ను రూపొందించారు. ఈ పోస్టర్ అతికిస్తే... లారీలను ఎవరూ ఆపకుండా పంపించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర గోదాములకు చేరిన సరకుల్లో రోజూ ఏ జిల్లాకు ఎంత వెళ్లాయి. ఎక్కడ ఎన్ని నిల్వలున్నాయని రోజూ స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీసి నివేదిక ఇస్తున్నారు. ఇలా సరకు నల్లబజారుకు తరలిపోకుండా అడ్డుకట్ట వేస్తున్నారు.
* రాష్ట్రంలోని వంట నూనెల తయారీ కంపెనీలకు ముడిపదార్థం గుజరాత్ నుంచి ఏపీలోని కృష్ణపట్నం పోర్టుకు వస్తుంది. ఏపీ అధికారులతో మాట్లాడి ముడి పదార్థాలు నిరంతరం నేరుగా తయారీదారులకే చేరేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తయారైన వంటనూనెలు రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు లారీల ద్వారా సరఫరా చేస్తున్నారు.