ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తాజాగా 14 మంది హిందీ అధ్యాపకులను బదిలీ చేశారు. కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రస్తుతం బిహార్ ఎన్నికల పర్యవేక్షకుడిగా వెళ్లారు. ఆయన వచ్చిన తర్వాత మిగతా సబ్జెక్టుల వారీగా స్థానచలనాలు జరగనున్నాయి. అధికారులు మాత్రం పనిభారం (వర్క్‌లోడ్) ఆధారంగా బదిలీలు చేస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 122 ప్రభుత్వ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకులు 1600 మంది వరకు ఉండగా... ఒప్పంద అధ్యాపకులు 830 మంది పనిచేస్తున్నారు.
బదిలీ చేస్తారేమోనని.. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల్లో గుబులు - Government lecturers transfer
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు బదిలీల భయం పట్టుకుంది. బదిలీలకు నిర్దిష్ట మార్గదర్శకాలు, నిబంధనలు, ప్రాతిపదిక లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ములుగు డిగ్రీ కళాశాల నుంచి గతేడాది హిందీ అధ్యాపకురాలిని కరీంనగర్ బదిలీ చేశారు. నర్సంపేట కళాశాలలో పనిచేసే అధ్యాపకురాలిని మూడు రోజులు అక్కడ, మరో మూడు రోజులు ములుగులో పనిచేయాలని ఉత్తర్వులిచ్చారు. ఈ సారి వరంగల్ కేడీసీలో పనిచేసే అధ్యాపకురాలిని ములుగు కళాశాలకు బదిలీ చేశారు. విచిత్రమేమిటంటే పోయిన ఏడాది ములుగు నుంచి కరీంనగర్‌కు బదిలీ అయిన అధ్యాపకురాలు.. ఈ సారి అక్కడి నుంచి మళ్లీ కోరుట్లకు బదిలీ అయ్యారు. అంటే ఏడాదికోచోట పనిచేయాల్సిన పరిస్థితి. మహబూబాబాద్ నుంచి గతేడాది హిందీ అధ్యాపకుడిని వరంగల్‌కు బదిలీ చేశారు. ఈ సారి మళ్లీ వరంగల్ నుంచి మహబూబాబాద్‌కు అధ్యాపకుడిని ఇచ్చారు.
ఏ ప్రాతిపదికన బదిలీలు జరుగుతున్నాయో అధ్యాపకులకు అంతుపట్టకుండా ఉంది. ఒక అధ్యాపకుడికి ఎంత మంది విద్యార్థులు ఉండాలన్నది కళాశాల విద్యాశాఖ స్పష్టం చేయలేదని.. ప్రవేశాలు ఇంకా పూర్తికాకుండానే బదిలీలు ప్రారంభించడమేంటన్న ప్రశ్న వారి నుంచి వస్తోంది. కళాశాలలో చేరిన తర్వాత కూడా పలువురు గ్రూపులు, ద్వితీయ సబ్జెక్టులు మార్చుకుంటారని, ఇప్పుడే బదిలీలు ప్రారంభించడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని పలువురు అధ్యాపకులు వ్యక్తంచేస్తున్నారు. బదిలీలు జరిపిన ప్రతిసారీ వివాదాస్పదంగా మారుతున్నందున ఈ సారైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతున్నారు. ‘బిహార్ నుంచి కమిషనర్ రాగానే ఆయనతో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటాం’ అని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి చెప్పారు.