మంత్రి ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ సీఎంకు బదిలీ - etela land issue
14:06 May 01
మంత్రి ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ సీఎంకు బదిలీ
తెరాస సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈటలను ఆయన నిర్వహిస్తున్న వైద్యారోగ్య శాఖను కొద్దిసేపటి క్రితం తప్పించింది. కరోనా నేపథ్యంలో అత్యంత సున్నితమైన ఆ శాఖను ముఖ్యమంత్రికి బదిలీ చేసింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
శుక్రవారం మంత్రి ఈటలపై కొందరు మెదక్ జిల్లాకు చెందిన రైతులు సీఎంకు ఫిర్యాదు చేయటం, దానిపై కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించటం చకచకా జరిగిపోయాయి. వివాదానికి కేంద్రంగా నిలిచిన మాసాయిపేట, హకీంపేట అసైన్డ్‌భూముల్లో సర్వేకు రెవిన్యూ, విజిలెన్స్ అధికారులు ఉదయం నుంచి విచారణ చేస్తున్నారు. ఈ రోజే సీఎంకు ఆ భూములపై నివేదిక అందించే అవకాశం ఉంది.
తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాత్రి తన నివాసంలో తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్.. ఈరోజు తన నివాసంలోనే ఉండి తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో గడుపుతున్నారు. ఈటలపై జరుగుతున్నదంతా కుట్రగా అభివర్ణిస్తూ ఆయన వర్గీయులు ఈ ఉదయం కాసేపు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈటల సొంత నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టారు. తనంతట తాను మంత్రి పదవికి రాజీనామా చేయని పక్షంలో మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదు అని ప్రభుత్వ వర్గాల సమాచారం.