తెలంగాణ

telangana

ETV Bharat / city

ట్రాన్స్‌కో డీఈల అవినీతి బాగోతం...

లక్షల్లో వేతనం.. సకల సౌకర్యాలు.. అయినా లంచం రుచిమరిగిన ప్రభుత్వ అధికారులు యధేచ్ఛగా దండుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏసీబీ దాడుల్లో సదరు అధికారుల బాగోతాలు బట్ట బయలయ్యాయి. రాష్ట్ర రాజధానిలో ఒక్కరోజే ఇద్దరు డివిజినల్‌ ఇంజినీర్‌స్థాయి అధికారులు అనిశాకు పట్టుబడడం విద్యుత్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

By

Published : Dec 13, 2019, 5:58 AM IST

ట్రాన్స్‌కో డీఈల అవినీతి బాగోతం...
ట్రాన్స్‌కో డీఈల అవినీతి బాగోతం...

లంచమివ్వనిదే అక్కడ పని జరగదు.. ఏది కావాలన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందే.. పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉంటోంది. టీఎస్​పీడీసీఎల్​లో ఇద్దరు ట్రాన్స్‌కో డీఈల అవినీతి బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. బాధితుల ఫిర్యాదుతో ట్రాన్స్‌కో విభాగంలో పనిచేసే ఇద్దరు డివిజినల్‌ ఇంజినీర్లను.. గంటల వ్యవధిలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ట్రాన్స్‌కో డీఈల అవినీతి బాగోతం...

లంచం వాయిదా పద్దతిలో చెల్లించమన్నాడు...
మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల డీఈప్రసాద్‌రావు.. గుత్తేదారుకు అనుకూలంగా వ్యవహరించేందుకు 30వేలు డిమాండ్‌ చేశాడు. ముందుగానే గుత్తేదారు 25వేలు ప్రసాద్‌రావుకు ఇచ్చాడు. తుది వాయిదా కింద 5వేలు ఇస్తుండగా అనిశా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం ఇళ్లు, కార్యాలయంలో అధికారులు సోదాలు చేశారు.

సంతకం కావాలంటే 25 వేలు కట్టాల్సిందే..
మెహదీపట్నం నానల్‌నగర్‌ వద్ద.. సైబర్‌ సిటీ సర్కిల్‌ డీఈ వెంకటరమణ.. గుత్తేదారు అంచనా వ్యయాన్ని అనుమతించేందుకు 25 వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత మాదాపూర్‌లోని స్వగృహంలో సోదాలు చేయగా కళ్లు చెదిరే అక్రమాస్తులు బయపడ్డాయి.

14రోజుల రిమాండ్‌
ఇద్దరు అధికారుల వద్ద పెద్దమొత్తంలో నగదు, బంగారం, వెండి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డీఈలు ప్రసాద్‌రావు, వెంకటరమణను.. అనిశా అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.ఇద్దరికి న్యాయస్థానం14రోజుల పాటు రిమాండ్‌ విధించింది.


"విద్యుత్‌శాఖలో సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్‌ స్తంభాలు పాతడం, తీగలు లాగడం వంటి పనులు నిరంతరం సాగుతుంటాయి. గుత్తేదారులు టెండర్లు వేసి పనులు దక్కించుకుంటారు. బిల్లు మంజూరు కావాలంటే సంబంధిత అధికారి దృవీకరించాలి. దీనిని ఆసరాగా చేసుకొని గుత్తేదారుల నుంచి అధికారులు లంచం డిమాండ్​ చేస్తున్నారు"

లంచగొండులపై చర్యలు తీసుకోండి
అడిగినంత డబ్బు ఇవ్వని గుత్తేదారులకు ప్రతి రోజు వేధింపులు తప్పవు.. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యుత్తు శాఖ విజిలెన్స్‌ విభాగం పరిశీలనలో ఎన్నో చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లంచాలు తీసుకునే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: 20 వేల తీసుకుంటూ అనిశాకి చిక్కిన లైన్ ఇన్​స్పెక్టర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details