Rain Effect: భారీ వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో పాటు విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజినల్ రైల్వే మేనేజర్లు వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. భారీ వర్షాల సమయంలో ట్రాక్ నిర్వహణకు సంబంధించి కచ్చితంగా తనిఖీలు చేపట్టాలని, రాత్రి సమయాల్లో కూడా పరిస్థితుల తీవ్రతను పర్యవేక్షించాలని అధికారులకు, పర్యవేక్షణ సిబ్బందికి జీఎం సూచించారు. రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు ఉంటే ప్రయాణం చేసే వారికి తాజా సమాచారాన్ని రైల్వే స్టేషన్ల వద్ద నిరంతరం ప్రకటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రమాదకర సెక్షన్లలో పరిస్థితులపై రోజువారీ నివేదికలు పంపాలని సిబ్బందిని ఆదేశించారు.
పలు రైళ్లు రద్దు..:భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 11 నుంచి 13 వరకు సికింద్రాబాద్- ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్-ఉందానగర్ మెము రైలు, మేడ్చల్-ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, ఉందానగర్-సికింద్రాబాద్ మెము స్పెషల్ రైలు, సికింద్రాబాద్- ఉందానగర్ మెము స్పెషల్ రైలు, హెచ్.ఎస్ నాందేడ్- మేడ్చల్-హెచ్‌ఎస్ నాందేడ్, సికింద్రాబాద్- మేడ్చల్ మెము రైలు, మేడ్చల్-సికింద్రాబాద్ మెము రైలు, కాకినాడ పోర్టు-విశాఖపట్నం మెము రైలు, విజయవాడ- బిట్రగుంట మెము రైలును రద్దు చేసినట్టు దక్షిణ మద్య రైల్వే పేర్కొంది.