తెలంగాణ

telangana

ETV Bharat / city

EXAMS: పరీక్షల సమయంలో మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారు?: సుప్రీంకోర్టు - supreme on exams in ap

పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది.

SC andhra pradesh
SC andhra pradesh

By

Published : Jun 24, 2021, 12:40 PM IST

పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించే గదుల వివరాలు అఫిడవిట్‌లో ఎక్కడా లేవని.. ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని వ్యాఖ్యానించింది.

ఇంత పెద్ద మొత్తంలో గదులు ఎలా అందుబాటులోకి తీసుకొస్తారని ప్రశ్నించింది. కరోనా వేళ ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశాం కదా.. అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించింది.

‘‘ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థులు ఎలా పరీక్ష రాయగలుగుతారు. వేలకొద్దీ పరీక్ష గదులను ఎలా అందుబాటులోకి తీసుకొచ్చి, సమన్వయం చేయగలుగుతారు. పరీక్ష నిర్వహించాం.. పని అయిపోయింది అనుకోలేము కదా. పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలి, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది.. ఇవేమీ మీ అఫిడవిట్​లో కనిపించలేదు. రెండో దశ తీవ్రతను చూసి.. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెపుతున్నా.. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది.

ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అవసరమైతే సీబీఎస్ఈ, యూజీసీ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలు తీసుకోవాలని సూచించింది. గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది. కొంత సమయం ఇస్తే.. చర్చించి ప్రభుత్వం నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని, ఈ వ్యవహారం విద్యార్థులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూడో వేవ్ వస్తే అప్పుడు ఏం చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇవేమీ మీరు ఆలోచించకుండా అఫిడవిట్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ రేపే చేపట్టనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:TET: 'టెట్‌'లో సంస్కరణలు అవసరం

ABOUT THE AUTHOR

...view details