- Traffic Awareness : మాదాపూర్-కూకట్‌పల్లి మార్గంలో వాహనం మొరాయించి రహదారిపై నిలిచిపోతే... క్షణాల్లో వాహనాలు బారులు తీరతాయి. అదే ఉదయం/సాయంత్రమో అయితే గమ్యం చేరేందుకు గంటల సమయం ఎదురు చూడాల్సిందేనా! అవసరం లేదు. సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న సిబ్బంది 3 నిమిషాల్లో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు చేరవేస్తారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే.. 5 నిమిషాల్లో ఎస్‌హెచ్‌వో, 10-15 నిమిషాలకు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులకు చెబుతారు. సాఫీగా ప్రయాణం సాగేలా తక్షణమే చర్యలు చేపడతారు.
- రాయదుర్గం-గచ్చిబౌలి మార్గంలో పైవంతెన కింద కూడలి. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ఎవరూ గమనించట్లేదనే భావనలో ఉంటారు. అటువంటి సమయంలో అకస్మాత్తుగా మైక్ నుంచి ఫలానా నంబరు బైక్/కారు జీబ్రాలైన్ దాటిందనో.. హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోలేదనో అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. అప్పటికీ దారికి రాకుంటే.. వారి వాహనం నంబరుతో జరిమానా విధించినట్టే లెక్క.
- సర్కారు కొలువులకు యువత సన్నద్ధమవుతున్నారు. పోటీ పరీక్షల్లో విజేతగా నిలిచేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.. చరిత్ర, భూగోళం, ఆర్థికం తదితర అంశాలపై పట్టు సాధించే పనిలో పడ్డారు. ఉద్యోగార్థులకు ఉపకరించే ప్రశ్నలు.. ఆ పక్కనే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే అంశాలను సామాజిక మాధ్యమాల్లో పొందుపరుస్తున్నారు.
Cyberabad Traffic Police : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాలను వేదికగా మలచుకున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విటర్.. ఇలా ప్రతిచోట ట్రాఫిక్ పాఠాలు నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏవో నాలుగు మాటలు.. మరికొన్ని హెచ్చరికలు చేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో గాకుండా.. సృజనాత్మకతకు రూపమిచ్చి అవగాహన కల్పిస్తున్నామంటున్నారు. ప్రతిరోజూ 4-5 వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఐటీ, కార్పొరేట్ సంస్థలు, ఉద్యోగులు అధికంగా ఉన్న సైబరాబాద్ పరిధిలో ఈ విధానం ప్రజలకు ఉపయోగకరంగా మారింది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 15 రోజులకు ఒకసారి ట్రాఫిక్ నియంత్రణ, చర్యలపై సమీక్షిస్తున్నారు. అఖండ, పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్.. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టుగా శిరస్త్రాణం, అతివేగం, మద్యం మత్తులో వాహనం నడపటం, సీటు బెల్ట్ ధరించటం వంటి అంశాలను సినిమా పాత్రల ద్వారా చెప్పిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.