ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ సమస్యతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నందున ప్రతి ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్ సాగర్ అందాలు కనువిందు చేస్తుండగా.. మరోవైపు విగ్రహాలతో పాటు... చిన్నపాటి ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. అయితే ఈమార్గంలో వాహనాల రాకపోకల వల్ల సందర్శకులు రోడ్డు దాటడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా కేటీఆర్... హైదరాబాద్ పోలీసులకు కోరారు.
మంత్రి కేటీఆర్ సూచనలపై స్పందించిన సీపీ అంజనీ కుమార్... ప్రతి ఆదివారం వాహనాలను వేరే మార్గంలో మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రచించారు. ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా దారి మళ్లిస్తారు. లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మీదుగా వాహనదారులు రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది. సందర్శకుల వాహనాలు మాత్రమే ట్యాంక్ బండ్ మీద 200 మీటర్ల లోనికి అనుమతిస్తారు. ఆ తర్వాత బారికేడ్లు వేసి... కేవలం కాలినడక ద్వారానే ట్యాంక్ బండ్‌పై తిరగాల్సి ఉంటుంది.