తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణేశుడు.. నేడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. వినాయక నిమజ్జనానికి భాగ్యనగరం సన్నద్ధమైంది. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions in Hyderabad) విధించి.. శోభాయాత్ర సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు అతిపెద్ద 25 చెరువులు, 25 నిమజ్జన కోనేరుల్లో ఈ కార్యక్రమం సాగుతుందని అధికారులు ప్రకటించారు. శోభాయాత్ర జరిగే రూట్లలో ట్రాఫిక్ నియంత్రిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గూగుల్ మ్యాప్స్‌లో ఎప్పటికప్పుడు రూట్ క్లియరెన్స్‌ను అప్డేట్ చేస్తూ ఉంటామని, ప్రజలు వాటిని చూస్తూ తమ గమ్యస్థానాలకు వెళ్లాలని సూచించారు.
గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకునే అవకాశం
నిమజ్జనం సాఫీగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సోమవారం 5 గంటల్లోపు నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు. శోభాయాత్ర సాఫీగా కొనసాగేందుకు బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకూ ఉన్న 17 కిలోమీటర్ల ప్రధాన ఊరేగింపు మార్గంలో 276 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించామని తెలిపారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకూ కొనసాగనున్న గణేశ్ శోభాయాత్రను గూగుల్ మ్యాప్స్‌కు అనుసంధానించారు. దీంతో శోభాయాత్ర గమనాన్ని నెటిజన్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇవి
చాంద్రాయణగుట్ట, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, ఆబిడ్స్, బషీర్‌బాగ్ లిబర్టీ, హుస్సేన్ సాగర్ వరకూ ఉన్న మార్గంలో విగ్రహాలు తీసుకొస్తున్న వాహనాలు మినహా ఇతర వాహనాలు అటూ, ఇటూ వెళ్లేందుకు అనుమతి లేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సమీపంలోని బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ కింద మాత్రమే వాహనాలు, ప్రజలను అటూ, ఇటూ అనుమతించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రం ట్రాఫిక్ పోలీసులు మినహాయింపు ఇస్తున్నారు.
అంతర్రాష్ట్ర సర్వీసులు.. భారీవాహనాలు
ఇతర రాష్ట్రాల బస్సులు, జిల్లాల బస్సులు ఆదివారం ఉదయం 10గంటలోపు మాత్రమే ఇమ్లీబన్ బస్టాండ్‌కు చేరుకోవాలి. తర్వాత ఆయా వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. భారీ వాహనాలు, సరకు రవాణా వాహనాలకు నగర రహదారులపై అనుమతి లేదు. ప్రైవేటు బస్సులు కూడా సోమవారం ఉదయం 10గంటల వరకు నగరంలో ప్రవేశించకూడదు. విమానాశ్రయానికి వెళ్లేవారు బాహ్యవలయ రహదారిని వినియోగించుకోవాలి.
ఖైరతాబాద్ గణపయ్య వెళ్లేదిలా..
- అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు భారీ వినాయకుడి విగ్రహాన్ని క్రేన్ సహాయంతో ట్రాలీపై ఎత్తిపెడతారు.
- తెల్లవారుజాము 4 నుంచి ఉదయం 7 గంటల వరకు ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు చేస్తారు.
- ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభం
- ఉదయం 9:30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4కు చేరుకునే అవకాశాలున్నాయి.
- ఇనుప కమ్మలు తొలగింపు, ప్రత్యేక పూజల అనంతరం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బడా గణేష్ గంగమ్మ ఒడికి చేరుతాడు.
- మహాగణపతి నిమజ్జనం అయ్యే వరకు ఆ మార్గంలో ఇతర విగ్రహాలు ఉన్న వాహనాలను అనుమతించరు.
- ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి శనివారం తొమ్మిదోరోజు భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేల మంది వచ్చి లంబోదరుడిని దర్శించుకున్నారు. మండపాన్ని తొలగించే పని శనివారం సాయంత్రానికే పూర్తి చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో గణపతి దర్శనాలను నిలిపివేశారు. భారీ వినాయకుడిని ఆ ట్రాలీపై ఉంచేందుకు వంద టన్నుల బరువును ఎత్తే భారీ క్రేన్ సిద్ధం చేశారు.
ఆర్టీసీ బస్సులు ఇక్కడి వరకే..
- మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులు మాసాబ్ ట్యాంక్
- కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్ సర్కిల్
- సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు సీటీవో, ఎస్‌బీహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ క్రాస్‌రోడ్స్
- ఉప్పల్ నుంచి వచ్చే బస్సులు రామంతాపూర్ టీవీ స్టేషన్
- దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే బస్సులు గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్
- రాజేంద్రనగర్ నుంచి వచ్చే బస్సులు దానమ్మ హట్స్
- ఇబ్రహీంపట్నం, మిధాని నుంచి వచ్చే బస్సులు ఐ.ఎస్.సదన్
- ఇంటర్ సిటీ ప్రత్యేక బస్సులు వైఎంసీఏ నారాయణగూడ, జమై ఉస్మానియా వైపు వెళ్లే బస్సులు తార్నాక కూడలి వరకే వెళ్తాయి.
- బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకూ ప్రధాన శోభాయాత్ర
సందర్శకుల పార్కింగ్ ప్రాంతాలు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఖైరతాబాద్, ఎంఎంటీఎస్ స్టేషన్, ఖైరతాబాద్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం, ఖైరతాబాద్, బుద్ధభవన్ వెనుకవైపు, సికింద్రాబాద్, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ దేవాలయం, లోయర్ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ స్డేడియం, నిజాం కళాశాల, బషీర్‌బాగ్, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి.
అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో..