గత మూడేళ్లలో భారీ సంఖ్యలోనే లైసెన్సులను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా 6-7 వేల వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ ప్రమాదాల్లో ఏటా 1500 మంది వరకు మరణిస్తున్నారు. కొందరు అంగవైకల్యానికి గురి అవుతున్నారు. ప్రధానంగా 90 శాతం రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణం.
ఉల్లంఘనులకు అడ్డుకట్ట వేసేందుకు జరిమానాలతోపాటు లైసెన్సులను 3-6 నెలలపాటు సస్పెండ్ చేయాలని గతంలో రవాణా శాఖ నిర్ణయింది. నగరంలో గత ఏడాది దాదాపు 900 లైసెన్సులను సస్పెండ్ చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 221 మంది లైసెన్సులను 3-6 నెలలపాటు సస్పెన్షన్‌లో ఉంచింది. ఖైరతాబాద్, తిరుమలగిరి, మలక్‌పేట్, టోలీచౌకి పరిధిలో రోజుకు సగటున ముగ్గురి వాహనదారుల లైసెన్సులను సస్పెండ్ చేస్తున్నారు. తద్వారా ఉల్లంఘనులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఆషామాషీగా తీసుకోవద్దు:
లైసెన్సుల రద్దు కోసం పోలీసులు సిఫార్సు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటించకపోతే 3-6 నెలల వరకు లైసెన్సు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక్కసారి లైసెన్సు సస్పెండ్ చేస్తే గడువు పూర్తి అయ్యే వరకు వాహనాలు నడిపే అవకాశం కోల్పోతారు. సదరు లైసెన్సును రవాణాశాఖ స్వాధీనం చేసుకుంటుంది. లైసెన్సు లేకుండా వాహనం బయటకు తీస్తే అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. విదేశాలకు వెళ్లే వారు అంతర్జాతీయ లైసెన్సులు తీసుకోవటానికి ప్రయత్నిస్తే ఇలాంటి కేసులు వారికి అడ్డంకిగా మారతాయి. - పాండురంగనాయక్,జేటీసీ, హైదరాబాద్.
రద్దుకు ప్రధాన కారణాలు...
- మద్యం తాగి వాహనాలు నడపటం
- అత్యంత వేగంగా వెళ్లడం
- పదేపదే సిగ్నిళ్లు దాటి వెళ్లడం
- వేగంగా, నిర్లక్ష్య డ్రైవింగ్
- సీటు బెల్టు పెట్టుకోకపోవడం
- శిరస్త్రాణాలు ధరించకపోవడం
- అపసవ్య దిశలో నడపటం
ఇవీ చూడండి:రాష్ట్రంలో కుర్రాళ్ల కొలువుల వేట..