Traffic new rules in Hyderabad: భాగ్యనగరంలో ట్రాఫిక్ చక్రబంధంతో గంటల తరబడి నిరీక్షణ, ప్రజలకు ఇబ్బందుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు 'ఆపరేషన్ రోప్' పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో పార్కింగ్, ఫుట్‌పాత్ ఆక్రమణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఆక్రమణలు, అడ్డగోలుగా నిలిపిన వాహనాల తొలగింపు కోసం ట్రాఫిక్ స్టేషన్‌కు 2 చొప్పున క్రేన్లు కేటాయించనున్నారు. నో పార్కింగ్‌లో నిలిపిన వాహనానికి క్లాంప్ పెట్టి.. దానిపై పోలీస్ అధికారి ఫోన్ నంబరు ప్రదర్శించటం జరుగుతుంది.
మల్టీప్లెక్స్‌లో 60 శాతం, మాల్స్‌లో 60 శాతం, కమర్షియల్ బిల్డింగ్స్ 40 శాతం, అపార్ట్‌మెంట్స్‌లో 30 శాతం పార్కింగ్ కచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వ్యాపార సముదాయాల్లో పార్కింగ్ కల్పించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించనున్నారు. వీధి వ్యాపారులు, తోపుడు బండ్లు రోడ్లపైకి రాకుండా సరిహద్దులు నిర్ణయించడంతో పాటు ప్రజాప్రతినిధులతో కలిసి వారికి సమస్యను వివరించి సహకరించేలా చేయనున్నారు. ఆర్టీసీ అధికారులతో చర్చించి ఇబ్బందికర బస్టాపులను మార్చి.. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక స్టాండ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేలా ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఉల్లంఘన కేసులు పెట్టారనేది కాకుండా.. ఎంతమందికి అవగాహన కల్పించామనేదే చూస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. జాయింట్ సీపీ, డీసీపీలు కూడా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఏడాదిలోగా అనుకున్న ఫలితాలు సాధిస్తామని.. స్టాప్ లైన్ నియంత్రణ అనేది అందరికీ అలవాటు కావాలని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా తొలగిస్తామన్నారు. డయల్ 100కు 70 నుంచి 80 శాతం ఫోన్లు ట్రాఫిక్ సమస్యలపై వస్తున్నాయని అన్నారు.
'ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోను మెయింటెయిన్ చేయాలంటే క్యారేజ్ వే ఫ్రీగా ఉండాలి. అప్పుడే వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి. కొవిడ్ ఇబ్బందులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీరియస్‌గా చేయడం లేదు. ఫ్రంట్ సీటు బెల్టుతో పాటు బ్యాక్ సీటు బెల్టు పెట్టుకునేలా త్వరలో అమలు చేయబోతున్నాం. సోషల్ మీడియాను అన్ని రకాలుగా వాడుకునేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. స్కూల్, కాలేజీల పరిసర ప్రాంతాల్లో మేనేజ్‌మెంట్‌లతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ట్రాఫిక్ సిబ్బందికి 30 శాతం అదనంగా అలవెన్స్ ఇస్తోంది. గతంలో ట్రాఫిక్ అంటే వద్దని వెళ్లిపోయేవారు.. కానీ, ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకొని ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలి. ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా త్వరలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం.'-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ పోలీసుల ఆపరేషన్ రోప్ ఇవీ చదవండి: