టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని ఇటీవల ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గృహనిర్బంధంపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్లమెంటుకు రాకుండా గృహనిర్బంధం చేశారని తెలిపారు. తన హక్కులకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోకాపేటలో భూముల వేలం పారదర్శకంగా జరగలేదని, వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. ప్రధాన మంత్రి మోదీకి, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిలకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవాళ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఉదయం దిల్లీ వెళ్లాల్సి ఉన్న రేవంత్ రెడ్డిని తెల్లవారు జామున పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.