Revanth Arrested : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ రకాలుగా నిరసనలు తెలపాలని యువజన కాంగ్రెస్‌కు రేవంత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయణ్ను అరెస్టు చేశారు.
రేవంత్ అరెస్టు అప్రజాస్వామికం
Revanth Arrest News : రేవంత్ రెడ్డి అరెస్టును పలువురు పీసీసీ నేతలు ఖండించారు. రేవంత్ అరెస్టు అక్రమం అని, అప్రజాస్వామికమని మహేశ్ కుమార్, మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నిర్బంధకాండ అమలవుతోందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారని వాపోయారు.
కేసీఆర్ బర్త్‌డే.. ప్రతిపక్షాలకు జైలు డే
కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి.. కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా అని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల కర్మ దినంగా మారిందని వాపోయారు. కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాలి పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు మద్ధతుగా, మెగా నోటిఫికేషన్ డిమాండ్‌తో అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన చేయాలని చెప్పారు.
రేవంత్‌ను అరెస్ట్ చేసి మొదట లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ వైపు తీసుకెళ్లిన పోలీసులు అక్కణ్నుంచి గోల్కొండ పీఎస్‌కు తరలించారు. గోల్కొండ పీఏస్ వెళ్లే దారులన్నీ మూసేశారు. పీఏస్‌కు కిలోమీటర్ దూరం నుంచి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ పీఏస్‌కు వచ్చే కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ వద్ద అంజన్‌కుమార్‌ను అరెస్టు చేశారు.
గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ సహా ముఖ్యనాయకులను గృహనిర్బంధం చేశారు. గాంధీ భవన్‌కు వెళ్తున్న హస్తం నేతలను ఎక్కడిక్కడ అరెస్టు చేశారు.