కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి, తెల్ల రేషన్‌కార్డున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొవిడ్ రోగులకు నామమాత్రపు రుసుముతో అంబులెన్సులు సమకూర్చాలన్నారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లతో కలిసి గురువారం ఆయన జూమ్ యాప్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో కరోనాను, బ్లాక్‌ఫంగస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చినా, తెలంగాణలో ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ దిక్కుమాలిన పథకమని అసెంబ్లీలో, బయట విమర్శించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ పథకంలో ఎలా చేరారని ఆక్షేపించారు. ఆయుష్మాన్ భారత్‌తో 26 లక్షల మందికి మేలు జరిగితే, ఆరోగ్యశ్రీతో దాదాపు 80 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని, పీహెచ్‌సీల్లో రోజువారీ పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి సూచించారు.
వైరస్ వ్యాప్తికి సీఎం కారణమయ్యారు: భట్టి
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ర్యాలీలు, సభలతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి సీఎం కారణమయ్యారు. జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు గాంధీకి వెళ్లి ‘నేనున్నాను’ అంటే ఎవరికి లాభం? ప్రైవేట్ ఆసుపత్రులను కట్టడి చేయడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఎటుపోయింది?’’ అని నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, కరోనా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సామాజిక భద్రత కల్పించాలని దాసోజు శ్రవణ్ అన్నారు.
్య నేడు (శుక్రవారం) మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని, ఏఐసీసీ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కరోనా బాధితులు, వారి కుటుంబాలు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు పండ్లు, మందులు, మాస్క్‌లు అందజేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు.
4% కోటా ఆపాలని చూస్తున్నారు: షబ్బీర్‌అలీ
రాష్ట్రంలో నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ కోటా అమలును నిలిపేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీలో ఒక్క ముస్లింనూ సభ్యుడిగా నియమించకపోవడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 నెలల్లో విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తామని చెప్పిన కేసీఆర్.. ఏడున్నర సంవత్సరాలవుతున్నా పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు. ఆరెస్సెస్ ఎజెండాను సీఎం అమలుచేస్తున్నారని షబ్బీర్‌అలీ మండిపడ్డారు.