రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 7 వరకు లాక్‌డౌన్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ స్వాగతించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మూడో సారి బహిరంగ లేఖ రాసింది. పేదలకు బియ్యం, నగదు పంపిణీ సక్రమంగా జరగలేదని కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. 13.4 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1500 నగదు అందలేదని పేర్కొన్నారు.
18 లక్షల తెల్లరేషన్ కార్డుల ధరఖాస్తులు, 4.5 లక్షలు బీపీఎల్ దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. రైతుబంధు లబ్ధిదారులు, తెల్లరేషన్ కార్డుదారులు నగదును డ్రా చేయడానికి బ్యాంకర్లు అనుమతించడం లేదని ధ్వజమెత్తారు. అకాల వర్షం, వడగళ్ళు వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రధానంగా మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సిరిసిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం జగిత్యాల్, కరీంనగర్ జిల్లాల రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పిడుగుపాటుతో మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు.