వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలున్నా.. పార్టీ అధిష్ఠానం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడే పనిచేస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) తెలిపారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్‌రెడ్డికి (TPCC chief Revanth Reddy) తన పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన రేవంత్‌రెడ్డి.. రేపటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.
మా ఇద్దరి మధ్య ఏం లేదు...
"రాజకీయాలకు అతీతంగా జగ్గారెడ్డి నాకు మిత్రుడు. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు అందరం కలిసి కృషి చేస్తాం. పార్టీలో రేవంత్‌కు, జగ్గారెడ్డికి మధ్యలో ఏదో కొట్లాట ఉందని చాలా మంది అపోహపడుతున్నారు. అదంతా ఏమీ లేదు. కాంగ్రెస్‌లో నేతల మధ్య మనస్పర్ధలొస్తే.. దాన్ని పట్టుకుని లబ్ధి పొందాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అలాంటి వాటికి కాంగ్రెస్‌లో స్థానం లేదు. అందరం పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు కలిసికట్టుగా పనిచేస్తాం. సీనియర్లందరినీ కలుపుకొని... సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతాం. తెరాస ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎలాంటి మేలు జరగలేదు. అందరం కూర్చొని పార్టీలో చర్చించి... నిరుద్యోగ సమస్యపై వీలైనంత త్వరగా కార్యాచరణ ప్రకటిస్తాం."
- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు