ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. వారం రోజులుగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున చెల్లించాలని కోరారు. విత్తనాలు, ఎరువులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం అమలు చేయాలని... తక్షణమే రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని రేవంత్ విమర్శించారు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న దురుద్దేశంతోనే వెనకడుగు వేసిందని మండిపడ్డారు. జాతీయ వ్యవసాయ బీమా సంస్థ రాష్ట్రంలో ‘వర్ష బీమా - 2021’ పేరుతో అమలు చేస్తున్న పథకం కేవలం ఏడు పంటలకు మాత్రమే పరిమితమైందన్నారు.