Revanth Letter to CM KCR: రైతు వేదికలను పునరుద్ధరించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే 25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ కల్తీ విత్తనాలు పురుగు మందులు తదితర సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని లేఖలో వివరించారు.
రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల పరిస్థితి ఎంతగానో కలిచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇటీవల మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్యం వేదికలు మహబూబాబాద్ ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు ఇచ్చినట్లు తెలిపారు. అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యకం చేశారు.