తెలంగాణ

telangana

ETV Bharat / city

REVANTH: 'రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు కోరడమే రాజగోపాల్​రెడ్డి చేసిన తప్పా..?'

రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కోరడమే తప్పా.. అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. అందుకు కేసులు పెట్టి వేధిస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే.. అధికార పార్టీ కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటామని రేవంత్​ రెడ్డి హెచ్చరించారు.

tpcc chief revanth reddy
tpcc chief revanth reddy

By

Published : Jul 28, 2021, 5:02 PM IST

రాష్ట్రంలో రాచరిక, నియంతృత్వ పాలన సాగుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటారా..?

నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని.. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ఆయన హక్కులను కాలరాసినట్లేనని రేవంత్​రెడ్డి అభిప్రాయపడ్డారు. వేలాది మంది పోలీసులు, తెరాస శ్రేణులు కలిసి కాంగ్రెస్ కార్యకర్తలను సమావేశానికి రాకుండా తనిఖీ కేంద్రాలు పెట్టి అడ్డుకున్నారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే అధికారికంగా చేయాల్సిన కొత్త రేషన్ కార్డుల పంపిణీని... తెరాస కార్యకర్తలు, పోలీసుల సమక్షంలో మంత్రి జగదీశ్​రెడ్డి చేపట్టారన్నారు.

దళితుల కోసమే మాట్లాడారు..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తన నియోజకవర్గ కేంద్రంలో అంబేడ్కర్​ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వెళ్తుంటే వేలాది మంది పోలీసులు, తెరాస కార్యకర్తలు కలిసి అడ్డుకున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.. మంత్రి జగదీశ్​రెడ్డిని అడగడం తప్పా.. అని రేవంత్​రెడ్డి నిలదీశారు. దళిత బంధు అమలుచేయాలని కోరితే కేసులు పెట్టి వేధిస్తారా అని నిలదీశారు. రాజగోపాల్​రెడ్డి దళితుల కోసమే మాట్లాడితే కేసు పెడతారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై కేసులు పెట్టి వేధిస్తే.. అధికార పార్టీ కార్యక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి హెచ్చరించారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీచూడండి:Komati reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు

ఇదీ జరిగింది..

యాదాద్రి జిల్లా లక్కారంలో మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి మధ్య చేలరేగిన వివాదం.. ఇంకా కొనసాగుతునే ఉంది. తాజాగా మునుగోడులోనూ దళిత బంధు అమలు చేయాలని.. 2 వేల మందితో నిరసన కార్యక్రమానికి రాజగోపాల్‌రెడ్డి యత్నించారు. ఇవాళ మునుగోడులో మంత్రి జగదీశ్‌రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉందని.. నిరసనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర‌్తలను అదుపులోకి తీసుకున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత.. బొంగులూరు గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అప్రమత్తం..

లక్కారంలో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో.. మంత్రి ప్రసంగాన్ని ఎమ్మెల్యే అడ్డుకోవడంతో.. రగడ మొదలైంది. చౌటుప్పల్​ తహసీల్దార్​ గిరిధర్‌ ఫిర్యాదుతో పోలీసులు రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈరోజు ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.

తనను అరెస్ట్ చేయడంతోపాటు..కాంగ్రెస్ కార్యకర్తలను గృహ నిర్బంధం చేయడాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఖండించారు. హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ను ఓడించడానికే.. దళితబంధు పథకం తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని.. డిమాండ్ చేశారు.

ఇదీచూడండి:MLA Rajagopal Reddy: 'ఈటలను ఓడించడానికే.. దళితబంధు పథకం'

ABOUT THE AUTHOR

...view details