ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు కలిసే తెలంగాణ రైతులకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారన్న విషయం సీఎం మీడియా సమావేశంలోని మాటలు స్పష్టం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనాల్సిందిగా కోరబోమని ఆయనే స్వయంగా కేంద్రానికి లేఖ ఇచ్చినట్టు కేసీఆర్ బహిరంగంగా ఒప్పుకున్నారన్నారు. తెలంగాణ రైతుల పక్షాన ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రైతు సంఘాలు, రైతు నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా కేంద్రానికి లేఖ ఏ కారణంతో ఇచ్చారని నిలదీశారు.
కేసుల విషయంలో కేసీఆర్‌కు ప్రధాన మంత్రి మోదీ సహకారం అవసరమని రేవంత్రెడ్డి ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగానే రైతుల ప్రయోజనాలకు ఉరివేసే లేఖను ఇచ్చారని ఆరోపించారు. బాయిల్డ్ రైస్ తీసుకోమని అడగబోమని కేంద్రానికి లేఖ ఇచ్చి ఇప్పుడు పోరాటం చేస్తానని చెప్పడం తెలంగాణ రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఏడాదిగా రైతులు కొట్లాడుతుంటే.. మోదీతో ములాఖత్, తెరాస పార్టీ ఆఫీసు శంకుస్థాపనలకు పదే పదే దిల్లీకి వెళ్లిన కేసీఆర్‌కు వాళ్లను పరామర్శించాలన్న ఆలోచన కలగలేదా అని రేవంత్ ప్రశ్నించారు.
ప్రగతి భవన్‌లో కేసీఆర్ మీడియా సమావేశం పెడితే.. రైతుల సమస్యలకు పరిష్కారం చూపిస్తారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచుతారని, కామారెడ్డి జిల్లాలో వరికుప్పపై రైతు బీరయ్య మృతిచెందడంపై స్పందిస్తారని ఆశించామన్న రేవంత్ రెడ్డి.. వాటి ఊసే ఎత్తలేదంటూ మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంలో వరి కుప్పపై గుండె పగిలి రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఒక్క తెరాస ఎమ్మెల్యేగానీ.. మంత్రి కానీ, కనీసం జిల్లా కలెక్టర్ కూడా పరామర్శించలేదని ధ్వజమెత్తారు.
పంట కోతలకు సైతం టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని.. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధి విధానాలపై మాట్లాడతారని ఎదురు చూశామని కానీ అవేవీ చేయకుండా కేంద్రంతో కయ్యం అంటూ మళ్లీ పాతపాటే పాడారని ధ్వజమెత్తారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తానేమీ చేయలేనని చేతులెత్తేశారని ఆరోపించారు.