Revanth Reddy on Agnipath: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ ఉపసంహరణకు పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సైనికులకు 6 నెలల శిక్షణ ఏం సరిపోతుందని ప్రశ్నించారు. అగ్నిపథ్ తీసుకొచ్చి యువత భవితను నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని మల్కాజిగిరి కూడలిలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ పాల్గొని మాట్లాడారు.
'ఈడీ దాడులకు కాంగ్రెస్ భయపడదు..మోదీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఈడీతో దాడులు చేయించినా కాంగ్రెస్ భయపడదు. రైతులు, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా కాంగ్రెస్ గుర్తించింది. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవాన్లను అవమానించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోంది. నాలుగేళ్లు సైన్యంలో పని చేసి ఆ తర్వాత బడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా'?: రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
పార్టీలకు అతీతంగా కాపాడుకోవాలి.. అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదు. మాజీ సైనికుల హోదా లేదు. పింఛన్ రాదు. సికింద్రాబాద్ అల్లర్ల సందర్భంగా తెలంగాణ యువకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను దిల్లీలో ఉన్న కేటీఆర్ కోరాలి. పార్టీలకు అతీతంగా యువకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్య్రాన్ని పణంగా పెట్టడమా? కోటి జనాభా లేని ఇజ్రాయెల్‌తో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ను పోలుస్తారా?: రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు