మహాత్మాగాంధీ జయంతి(Gandhi Jayanthi 2021) సందర్భంగా గాంధీభవన్‌లో మహాత్ముడి విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి దేశానికి గాంధీ చేసిన సేవలు స్మరించుకున్నారు. అనంతరం లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు బోసురాజు, షబ్బీర్ అలీ, పొన్నాల పాల్గొన్నారు.
గాంధీ(Gandhi Jayanthi 2021) కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి రాష్ట్ర సర్కార్ కృషి చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. సంపూర్ణ సమైఖ్య జాతి నిర్మాణం, రాజకీయాల్లో నైతికతను గాంధీ ఆశించారని తెలిపారు. నిజాయతీతో కూడిన రాజకీయాలు రావాలంటే ప్రజలు చైతన్యవంతులవ్వాలని ఆకాంక్షించారు. బాపూ జీవితం, ఆయన ఆదర్శాలు నేటి తరం అనుసరించాలని అన్నారు. గాంధీ ఆచరించిన సూత్రాలు సమకాలీన ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. ఇవి లక్షలాది మందికి బలాన్నిస్తాయని పేర్కొన్నారు.
"సత్యం, అహింసలే ఆయుధాలుగా గాంధీ పోరాడారు. స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. భారతదేశాన్ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను బలంగా తీర్చిదిద్ది, అన్ని దేశాలకు ఆదర్శంగా నిలపడానికి గాంధీ ఎంతో కృషి చేశారు. చివరి శ్వాస వరకు దేశఅభ్యున్నతి కోసం బాపూజీ పాటుపడ్డారు. ఎంత పెద్ద సమస్య అయినా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చని జాతిపిత నిరూపించారు. బాపూ బాటలో నేటి యువత పయనించాలి. బాధ్యతాయుతంగా మెలిగి దేశ ప్రగతిలో భాగస్వాములవ్వాలి."