Revanth Reddy Comments: తెరాస, భాజపా ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకే ఆ పార్టీల నేతలు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, ఎంపీలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మోటార్లకు మీటర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తెరాస ఎంపీలు సభకే హాజరుకాలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చెల్లించిన డబ్బును పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఖర్చు చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని త్వరలో ఏఐసీసీ ప్రకటిస్తుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కసరత్తు టీపీసీసీ స్థాయిలో పూర్తయిందని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను ఏఐసీసీకి పంపినట్లు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే రాజాసింగ్‌ను భాజపా ఆయుధంగా ఉపయోగించుకుంటుందని ఎంపీ ఉత్తమ్ ఆరోపించారు. ఉపఎన్నికల వేళ ఓట్ల కోసం కొత్తగా విద్యుత్ బకాయిల లొల్లిని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
"కవిత మీద బీజేపీ ఎంపీలు లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ, ఈడీ మరి ఆమె ఇంటికి ఎందుకు వెళ్లడం లేదు. భాజపా బ్లాక్ మెయిల్ చేసి ప్రొటెక్షన్ మనీ సంపాదిస్తోంది. రాహుల్ పాద యాత్ర చేస్తున్నారు.. మోదీ మోకాళ్ల యాత్ర చేస్తారా? బంగాల్ మోడల్ ఇక్కడ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో తెరాస, భాజపా డ్రామాలు చేస్తున్నాయి. బండి పాద యాత్ర వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం లేదు. ఆయనకు మోకాళ్ల చిప్పలు అరుగుతాయి. ఉపఎన్నికల ముంగిట విద్యుత్ బకాయిల పేరిట తీట పంచాయితీ తెచ్చారు. ఆగస్టు 8న మోటార్లకు మీటర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. చీకటి ఒప్పందం కారణంగా తెరాస ఎంపీలెవరూ పార్లమెంటుకు రాలేదు. ఉభయకుశలోపరి మాదిరిగా భాజపా-తెరాస ఒకరినొకరు తిట్టుకుంటున్నారు."- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు