కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, పాలు, బియ్యం, జీలకర్ర, సోంపు తదితర నిత్యావసరాలను సేకరించి అత్యంత ఆధునాతన పరిజ్ఞానం ఉన్న 30 జాతీయ ప్రయోగశాలల్లో పరీక్షిస్తుంటారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కు చెందిన జాతీయ పరిశోధనా సంస్థలు, ఆరోగ్యశాఖకు చెందిన 30 ప్రయోగశాలల్లో ఈ పరీక్షలు జరుగుతుంటాయి. తెలంగాణలోని వివిధ మార్కెట్ల నుంచి సేకరించిన కూరగాయలను పరీక్షించగా నిషేధిత రసాయన అవశేషాలున్నట్లు తేలిందని కేంద్ర వ్యవసాయశాఖ 2019-20 సంవత్సరం పరీక్షల వివరాలపై రాష్ట్రానికి లేఖ రాసింది.
సేంద్రియ పంటలపైనా
ఇటీవల పురుగు మందులు ఉండవనే ఉద్దేశంతో సేంద్రియ ఉత్పత్తుల వైపు మొగ్గుచూపుతున్నారు. కాని వాటిపైనా రసాయనాలుంటున్నట్లు తాజాగా తేలింది. సేంద్రియ పద్ధతిలో పండించారంటూ అమ్ముతున్న ఇలాంటి దుకాణాల్లో వాటిని ఎక్కడ ఏ రైతు పండించారనే వివరాలు ఇవ్వడంలేదు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ ఆర్గానికి స్టోర్స్ నుంచి 2019 మే నెలలో క్యాప్సికం, సెప్టెంబరులో పచ్చిమిరప, డిసెంబరులో కాకరకాయలను తీసుకెళ్లి పరీక్షించారు. ఈ మూడింటిపైనా ‘మిథైల్ పెరాథియాన్’ రసాయనం కనిపించింది.
ఏమిటీ రసాయనం?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ‘మిథైల్ పెరాథియాన్’ను నిషేధించారు. ఇది కలిస్తే నీళ్లు కూడా విషపూరితమవుతాయి. ఇది వెల్లుల్లి వాసనతో తెలుపు రంగులో పొడిలా ఉంటుంది. ఇది అత్యంత విషపూరిత రసాయనమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కళ్లు, చర్మంపై పడినా ప్రమాదమే. కడుపులోకి వెళితే తలనొప్పి, ముక్కు కారడం, ఛాతీలో పట్టేసినట్లు, నీరసం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇది 0.2 మి.గ్రా. మోతాదులో శరీరంలోకి చేరినా ప్రమాదమేనని అమెరికా జాతీయ ఆరోగ్యశాఖ తెలిపింది. కాని మన హైదరాబాద్‌లోని కొత్తపేట రైతుబజారు నుంచి సేకరించిన ఆకుకూరల్లో ఏకంగా 3.31 మిల్లీగ్రాముల మిథైల్ పెరాథియాన్ ఉందని తేలడం గమనార్హం.
మనం చేయాల్సింది ఏమిటి?