రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 25 వేల ట్రావెల్స్ కార్యాలయాలున్నాయి. ఒక్కో కార్యాలయంలో చిన్న సంస్థ అయితే ఐదుగురు, పెద్ద సంస్థ అయితే.. సుమారు 500మంది వరకు పనిచేస్తారు. వారితో పాటు డ్రైవర్లు, క్లీనర్లు అదనం. టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు అనుబంధంగా మెకానిక్, పెయింటర్, రేడియం స్టిక్కర్లు వేసేవారు ఆధారపడి జీవిస్తుంటారు. గ్రేటర్ పరిధిలో పనిచేస్తున్న ఐటీ సంస్థల కోసం సుమారు లక్షా 50 వేల వాహనాలు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఐటీ సంస్థలు చాలా వరకు వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తుండడంతో వాహనాలు కేవలం షెడ్డులకే పరిమితమయ్యాయి.
సమస్య మళ్లీ మొదటికి..
నాలుగు నెలలుగా కార్యాలయాల అద్దెలు, సిబ్బందికి జీతాలు చెల్లించలేక వాహన యజమానులు అవస్థలు పడుతున్నారు. లోన్ తీసుకుని కొనుక్కున్న వాహనాల కిస్తీలు కట్టలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటికి తోడు ఇన్సూరెన్స్, పన్ను చెల్లించాలంటూ రవాణాశాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విధిలేక కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలోని ఆర్టీఏ అధికారులకు వాహనాలు అప్పగించేందుకు యజమానులు సిద్ధమయ్యారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోగా అప్పటికి వెనక్కి తగ్గారు. కానీ.. ఇప్పుడు సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. రెండ్రోజులక్రితం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయండంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు