Hyderabad Traffic control updates: హైదరాబాద్‌లోని వాహనదారులు.. తరచూ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కు కుంటున్నారు. కొన్ని ప్రధాన మార్గాల్లో గంటలతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇక వర్షం వస్తే అంతే సంగతులు. వాహనాలు ముందుకు కదల్లేని దుస్థితి. ట్రాఫిక్ పోలీసులతో పాటు, కమిషనర్లు, మంత్రులకు ట్రాఫిక్ సమస్యపై నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. సిబ్బంది పనిచేస్తున్నా కొన్ని లోటుపాట్లు సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది.
వారికి మోత తప్పదు: కూడళ్ల వద్ద వాహనదారులు స్టాప్‌లైన్ దాటి ముందుకురావడం, ఫ్రీ లెఫ్ట్‌లను బ్లాక్ చేస్తుండటం. ఆర్టీసీ ఆటో డ్రైవర్ల నిర్వాకంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. కూడళ్ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆటోడ్రైవర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆ పరిస్థితిని గమనించిన అధికారులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సహకరించాలని అవగాహన కల్పిస్తున్నారు. మాట వినకుంటే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. కొందరు ట్రాఫిక్ పోలీసుల ఉదాసీనతను గమనించిన ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగనున్నారు. ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ సహా ఇతర అధికారులు నేరుగా రహదారులపైకి తిరుగుతూ ట్రాఫిక్‌ను పర్యవేక్షించనున్నారు.
నగరంలో ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాం. పుట్‌పాత్‌లో ఆక్రమణలు, ఎక్కడబడితే అక్కడ పార్కింగ్, సెల్లార్లను వాణిజ్యపరంగా వాడటం వల్ల సమస్య అధికమవుతోంది. రేపటి నుంచి చేపట్టే డ్రైవ్‌లో ఈ సమస్యలు పరిష్కరిస్తాం. -రంగనాథ్, ట్రాఫిక్ సంయుక్త సీపీ