ఇవాళ సహకార ఎన్నికలు.. సాయంత్రం ఫలితాలు
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 905 సహకార సంఘాలకు గాను ఇప్పటికే 156 సొసైటీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 11,564 వార్డుల్లో... 46 శాతం ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 747 సొసైటీల పరిధిలోని 6,248 మంది డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించేందుకు సహకార శాఖ ఎన్నికల అథారిటీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
సాయంత్రం ఫలితాలు
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల నిర్వహణకు 747 మంది గెజిటెడ్ అధికారులను ఎన్నికల అధికారులుగా... మరో 20 వేలని సిబ్బందిని నియమించింది. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పత్రాలు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు అందుబాటులో ఉండేలా సరఫరా చేసింది. ఇవాళ సుమారు 12 లక్షల మంది పైగా రైతులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి... సాయంత్రం ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
ఎన్నికలు ముగిసిన మూడు రోజుల్లో పాలకవర్గాల నియామకాలను చేపట్టాలని నిబంధన ఉంది. రాజకీయ పార్టీ విచిత్ర పొత్తుల నడుమ సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికల సందర్భంగా... ఏదైనా సమస్యలు తలెత్తినట్లైతే... సహకార చట్టం ప్రకారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ సహకార సంఘ ఎన్నికల వేళ... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా అవసరమైన పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర స్థాయి వరకు పదవులు
ఫ్యాక్స్‌కు ఎన్నికైన వార్డు డైరెక్టర్ల నుంచే సంఘాలకు ఛైర్మన్లుగా ఎన్నికవుతారు. ఈ ఛైర్మన్ల నుంచే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ, పాలకవర్గాల ఎన్నిక జరుగుతుంది. జిల్లా స్థాయి పదవులు కావడంతో ఆ పోస్టులకు గిరాకీ ఎక్కువ. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు, టీఎస్ సహకార మార్కెటింగ్ సమాఖ్య పాలకవర్గాలనూ సొసైటీ ఛైర్మన్ల నుంచే నియమిస్తారు. ఇవి రాష్ట్ర స్థాయి పదవులు, కేబినెట్ హోదా ఉంటుంది. ఆ కీలక పదవులపై గురిపెట్టిన నేతలు... జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి తమ జిల్లాల్లో ఎక్కువ సంఘాలు గెలిపించుకునేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు.
ఇదీ చూడండి:భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్