తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సర్వం సిద్ధం - ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వార్తలు

ఏపీలో రేపు జరగనున్న ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాల నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

tomorrow-teacher-mlc-elections
రేపే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సర్వం సిద్ధం

By

Published : Mar 13, 2021, 7:33 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాల నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్‌ల పరిధిలోని కేంద్రాల్లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించనున్నారు. 17న ఓట్ల లెక్కింపు జరగనుంది.

అంకె వేయాలి..
ఓటర్లు ప్రిసైడింగ్‌ అధికారి ఇచ్చే వయెలెట్‌ స్కెచ్‌ పెన్‌ మాత్రమే వినియోగించి.. తమకు నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా తమ ప్రాధాన్యత అంకె వేయాల్సి ఉంటుంది.

ఉభయ గోదావరిలో హోరాహోరీ
ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ రాము సూర్యారావు పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈసారి ఆయన ఎన్నికల బరిలో లేరు. పీడీఎఫ్‌ అభ్యర్థిగా యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ షాబ్జీ పోటీ చేస్తున్నారు. యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌-1938 సంఘాలు మద్దతు ప్రకటించాయి. విశ్రాంత అధ్యాపకుడు గంధం నారాయణరావుకు ఎస్టీయూ, పీఆర్టీయూ సంఘాల మద్దతుంది. రాజానగరం వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఆయన మామ అవుతారు. గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలైన చెరుకూరి సుభాష్‌చంద్రబోస్‌కు ఈసారి తెదేపా మద్దతు ప్రకటించింది. వీరితోపాటు ఇళ్ల సత్యనారాయణ, గంటా నాగేశ్వరరావు, తిర్రే రవిదేవా, డా.ఎంబీ నాగేశ్వరరావు, పలివెల వీర్రాజు, బడుగు సాయిబాబ, యడవల్లి రామకృష్ణప్రసాద్‌, డా.పి.వంశీకృష్ణ రాజా కూడా బరిలో ఉన్నారు.

గుంటూరు-కృష్ణాలో పోటాపోటీ
గుంటూరు-కృష్ణా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న ఎ.ఎస్‌.రామకృష్ణ పదవీ కాలం ముగియనుండటంతో మరోమారు ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు తెదేపా, ఆక్టా తదితరుల మద్దతు ఉంది. గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గతంలో పనిచేసిన బొడ్డు నాగేశ్వరరావు ఈసారి కూడా పీడీఎఫ్‌ తరఫున బరిలో నిలిచారు. ఆయనకు యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌-1938ల మద్దతుంది. ఏపీటీఎఫ్‌-257 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్‌రావు పోటీలో ఉండగా.. డీటీఎఫ్‌ మద్దతిచ్చింది. పీఆర్‌టీయూలోని కృష్ణయ్య అధ్యక్షుడిగా ఉన్న సంఘంతోపాటు మరికొన్ని సంఘాలు టి.కల్పలతకు మద్దతిస్తున్నాయి. ఆమె రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి భార్య. ఎస్టీయూ, అమరావతి పరిరక్షణ సమితి, సీపీఐ మద్దతుతో పీవీ మల్లికార్జునరావు పోటీ చేస్తున్నారు. మరో అభ్యర్థి గాదె వెంకటేశ్వరరావుకు జనసేన మద్దతు ప్రకటించింది. ఓ రాష్ట్ర మంత్రి బంధువుగా చెబుతూ చందు రామారావు బరిలో ఉన్నారు.

ఇవీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం.. వేలు పలుకుతున్న ఓట్లు

ABOUT THE AUTHOR

...view details