దేశంలో సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దిల్లీలోనే ఉండి కేసును దర్యాప్తు చేసేలా చూస్తామని తెలిపారు. ఈ మేరకు మాజీ జస్టిస్ పి.వి.రెడ్డిని సంప్రదించామని.. కానీ, అందుకు ఆయన నిరాకరించారని చెప్పారు. దర్యాప్తుపై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
తెలంగాణ హైకోర్టులో కేసు కొనసాగుతున్న విషయాన్ని విచారణ సందర్భంగా జస్టిస్ బోబ్డే ప్రస్తావించారు. అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ.. తమ వాదనలు విన్న తర్వాత ముందుకు వెళ్లాలని ధర్మాసనాన్ని కోరారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సత్వర విచారణకు తీసుకోవాలన్న న్యాయవాది జీఎస్ మణి వినతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది.