Tollywood Celebrities Meet AP CM Jagan: ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లపై ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, నారాయణమూర్తి ఈ భేటీలో పాల్గొన్నారు. మొదటగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వీరు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.
జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని పరిశ్రమ ప్రముఖులు కోరారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా... టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫార్సులపై సినీ ప్రముఖులతో సీఎం జగన్ చర్చించారు. ఎంతమేర టికెట్లు పెంచాలనే దానిపై అభిప్రాయాలు తీసుకుంటారని తెలిసింది.
వివిధ అంశాలపై...
రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా..చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సాయంపైనా సీఎంతో సినీ ప్రముఖులు చర్చించారని సమాచారం. కొవిడ్ తొలిదశలో లాక్డౌన్ కారణంగా 3నెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత తెరచుకున్నా 50 శాతం సీటింగ్ సహా వివిధ రకాల ఆంక్షలతో రాబడి అంతంతమాత్రమేనని యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ల యజమానులకు కరెంట్ బిల్లుల రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా కూడా చర్చించారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వడం, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ పరిశ్రమ ప్రముఖులతో సమావేశం ఉండటం, అలాగే టికెట్ రేట్ల పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తున్నందున.. బుధవారం సీఎంతో మంత్రి పేర్ని నాని సమావేశమై చర్చించారు.
ఏపీ సీఎంతో భేటీ తర్వాత అన్ని వివరాలు చెబుతా. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వివరాలు మీడియాకు ఇస్తారు. కచ్చితంగా ఇవాళ సినీ సమస్యలకు శుభం కార్డు పడుతుంది. సీఎం నుంచి ఆహ్వానం మేరకే వెళ్తున్నా. సమావేశానికి ఎవరిని పిలిచారో అక్కడికి వెళ్లాక తెలుస్తుంది.
-- చిరంజీవి, సినీనటుడు