తెలంగాణ

telangana

ETV Bharat / city

TRS Meeting: నేడు తెరాస కీలక సమావేశం.. శ్రేణులకు సీఎం దిశానిర్దేశం - trs meeting updates

దళిత బంధు పథకం, పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజురాబాద్ ఎన్నిక తదితర అంశాలపైచర్చించేందుకు నేడు తెరాస కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరగనున్న భేటీలో దళిత బంధు ప్రాధాన్యత, పథకం రూపకల్పన వెనక ఉద్దేశ్యాలను సీఎం కేసీఆర్​.. పార్టీ శ్రేణులకు వివరించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు నిర్దిష్ట గడువును ప్రకటించనున్నారు.

today trs party key meeting in hydrabad
today trs party key meeting in hydrabad

By

Published : Aug 24, 2021, 5:08 AM IST

దళితుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా దళితబంధు పథకం తీసుకొచ్చిన ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్​.. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం రెండుగంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్న కేసీఆర్‌… పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజురాబాద్‌ ఉపఎన్నికల అంశాలపై చర్చించనున్నారు. ఆ సమావేశంలో దళిత బంధు పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. దళిత బంధు పథకం అమలులో పార్టీ శ్రేణుల బాధ్యతలేమిటి... విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యే సమావేశంలో దళితబంధు ప్రాధాన్యతలు, పథకం రూపకల్పన వెనక ఉద్దేశ్యాలను కేసీఆర్ వివరించనున్నారు. ఇప్పటికే పథకం అమలుపై పలుమార్లు సమీక్ష నిర్వహించిన సీఎం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిగిలిన గ్రామాల మాదిరిగా దళిత కాలనీలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా నేతలతో కేసీఆర్​ చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు పూర్తయినందున.. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు నిర్దిష్టగడువు ప్రకటించనున్నారు. ఉద్యమ కారులు, మహిళలు, అన్ని వర్గాలకు పార్టీ కమిటీల్లో ప్రాధాన్యమివ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో.. తెరాస అనుసరించనున్న పాత్రను పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇతర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details