తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా మహమ్మారిపై సమరం.. నేటి నుంచి వ్యాక్సినేషన్ - కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న మోదీ

ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మరిని కట్టడి చేసేందుకు ఇవాళ దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో సర్కారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనుంది. మహమ్మరి నుంచి బయటపడేందుకు దివ్య ఔషధంగా టీకాని భావిస్తున్న తరుణంలో... ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. తొలి రోజు సుమారు 4వేల మందికి పైగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

కరోనా మహమ్మారిపై సమరం.. నేటి నుంచి వ్యాక్సినేషన్
కరోనా మహమ్మారిపై సమరం.. నేటి నుంచి వ్యాక్సినేషన్

By

Published : Jan 16, 2021, 3:12 AM IST

కరోనా మహమ్మారిపై సమరం.. నేటి నుంచి వ్యాక్సినేషన్

మహమ్మారి వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. రాష్ట్రంలో పది నెలలుగా కొవిడ్‌పై పోరాటం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి టీకాల కార్యక్రమం 140 కేంద్రాల్లో జరగనుంది. ఒక్కో కేంద్రంలో సుమారు 30 మంది చొప్పున దాదాపు 4వేల మందికి పైగా ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొవిడ్ రోగులకు ఎనలేని సేవ చేసిన పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తిస్తూ....వారికే తొలి వ్యాక్సిన్ ఇవ్వనుండటం హర్షణీయం. రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి సాఫ్ట్‌వేర్ ఆధారంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుండటం గమనార్హం.

సర్వం సిద్ధం
వ్యాక్సిన్ తీసుకోనున్న వారికి ఇప్పటికే వ్యక్తిగతంగా సందేశాలను పంపారు. అన్ని జిల్లాలకు సరిపడా వ్యాక్సిన్ డోసులు, సిరంజీల సరఫరా పూర్తైంది. ఒక్కో కేంద్రంలో వాక్సినేషన్ కోసం మూడు గదులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డును వ్యాక్సిన్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. లబ్ధిదారుల వివరాలను కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో సరిపోల్చుకున్న తర్వాత టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి వేలికి సిరా చుక్క వేసి వివరాలను కోవిన్ సాఫ్ట్​వేర్‌లో పొందుపరుస్తారు. అరగంట పాటు వారిని ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తారు. అత్యవసర వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలతో పాటు... ప్రతీ కేంద్రంలో తగిన మందులతో కూడిన కిట్‌ని అందుబాటులో ఉంచారు. బాధితుల తరలింపునకు 400కి పైగా అంబులెన్స్‌లతో పాటు 57 ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఐసీయూ వార్డులను సిద్ధం చేశారు.

మూడు లక్షల మంది ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోగా మొత్తం 1,213 కేంద్రాల ద్వారా పది రోజుల్లో ఆరోగ్య సిబ్బందికి వాక్సినేషన్​ని పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. క్రమంగా వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్య పెంచడం, ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. వివిధ శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్న వైద్య ఆరోగ్య శాఖ... జిల్లాల్లో కలెక్టర్‌లు, తహసిల్దార్ల ఆధ్వర్యంలో ప్రక్రియను నిర్వహిస్తోంది.

లబ్ధిదారులతో ప్రధాని..

నేటి వాక్సినేషన్ ప్రక్రియను లాంఛనా ప్రాయంగా ప్రారంభినచనున్న ప్రధాని మోదీ గాంధీ ఆసుపత్రి, నార్సింగి ప్రాంతీయ వైద్యకేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్న వారితో ముచ్చటించనున్నారు. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ నిమ్స్‌లో, మంత్రి ఈటల, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాంధీలో వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని వాక్సినేషన్ కేంద్రాల్లో టీకా ప్రక్రియని ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి:రేపు మొదటి డోసు వ్యాక్సినేషన్... నేనూ టీకా తీసుకుంటా: ఈటల

ABOUT THE AUTHOR

...view details